తెలంగాణ పదేండ్ల కింద రాష్ట్రమైంది.. కానీ పొరుగున ఉన్న మహారాష్ట్ర 70 కింద రాష్ట్రం అయింది.. మన కంటే వారే మంచిగా ఉండాలి..? మరి ఎందుకు లేరు.. దీనికి కారణం ఏందని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు. సరైన ప్రభుత్వాలు ఉంటే.. సరైన భవిష్యత్ ఉంటుంది. అందుకే సరైన పార్టీకి ఓటేసి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కేసీఆర్ సూచించారు. ముథోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పార్టీ అభ్యర్థి విఠల్ రెడ్డికి మద్దతుగా కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణను కాంగ్రెస్ 50 ఏండ్లు పరిపాలించింది.. మధ్యలో టీడీపీ ఉంది.. 10 ఏండ్ల నుంచి బీఆర్ఎస్ ఉందని కేసీఆర్ గుర్తు చేశారు. ఏ పార్టీ ఏం చేసిందో మీకు తెలుసు. దాన్ని చూసి మీరు నిర్ణయం చేయాలి. రైతుబంధు దండుగ అని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబారా అంటున్నాడు. రేవంత్ రెడ్డేమో కేసీఆర్ వేస్ట్‌గా 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు. మూడు గంటలు సరిపోతదని అంటున్నడు. ఈ రోజు భారతదేశంలో అన్నింటికి ఇండ్లకు, దుకాణాలకు, పరిశ్రమలకు, ఐటీకి, వ్యవసాయానికి 24 గంటలు మంచి కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఈ సంగతి నాకంటే మీకు బాగా తెలుసు. ఎందువల్ల అంటే.. పక్కకే మహారాష్ట్ర బోర్డర్ ఉంది. రోజు పోయి వస్తరు ఏదో పని మీద. మహారాష్ట్ర రైతులు మన దగ్గర భూమి కొనుక్కొని ఇక్కడ బోర్లు వేసి అక్కడ పంటలు పండించుకుంటున్నారు. మహారాష్ట్రకు ఏం తక్కువైంది. మన హైదరాబాద్ కంటే పెద్దనగరం బొంబై ఉంది. మనం పదేండ్ల కింద రాష్ట్రం. వారు 70 ఏండ్ల కింద రాష్ట్రం అయింది. వారే మంచిగా ఉండాలి కదా. ఏం కారణం అని కేసీఆర్ నిలదీశారు.
ఇవాళ మహారాష్ట్ర నుంచి లారీ వస్తే, కారులో వస్తే బోర్డర్‌లో దాబాలో చాయ్ తాగి తెలంగాణ ఎక్కడ ఉంది అనిడిగితే రోడ్డు నున్నగా వస్తదో అక్కడనుంచి తెలంగాణ అని చెబుతున్నారు అని కేసీఆర్ తెలిపారు. ఈ విషయం మీకు తెలుసు. పరిపాలన బాగుంటే ఇవన్నీ సాధ్యమవుతాయి. అవతల లైటు లేదు. ఇక్కడ 24 గంటలు కరెంట్ ఉంటంది. దీనికి కారణం ఏంది. కడుపు కొట్టుకుని, పట్టుదలతో, చిత్తశుద్ధితో, మొండి పద్దతిలో పని చేస్తున్నాం. అందుకే అన్ని సమస్యలను పరిష్కరించుకుంటున్నాం. తెలంగాణ వచ్చే సమయానికి ఆగమాగం ఉండే. కరెంట్, సాగు, తాగు నీరు లేదు. వలపసలు పోయారు. ఈ తెలంగాణ ఎట్ల ముందుకు తీసుకుపోవాలి అని మూడు నాలుగు మాసాలు మేధావులతో మాట్లాడి ఎజెండా చేసుకున్నాం. 70 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. వ్యవసాయాన్ని స్థీరికరించాలని నిర్ణయించాం. 24 గంటల కరెంట్ ఇవ్వాలని నిర్ణయించాం. నీళ్లకు ట్యాక్స్ లేదు. రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నాం. ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని కేసీఆర్ తెలిపారు.
ధరణి లేక ముందు పైరవీకారుల రాజ్యం.. లంచాల రాజ్యం ఉండే కేసీఆర్ గుర్తు చేశారు. ఒక పట్టా కావాలంటే ఆర్నేళ్లు, ఏడాది ఆర్డీవో ఆఫీసు చుట్టు తిరిగేది. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చాక మండలాల్లోనే 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అవుతుంది. మరో 10 నిమిషాల్లో పట్టా చేతికి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గ్యారెంటీగా ధరణిని తీసి బంగాళాఖాతంలో పారేస్తరట. ధరణి తీసేస్తే.. మళ్లీ దళారుల రాజ్యం వస్తది. లంచాలు అడుగుతారు. కానీ ఇవాళ రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోలు డబ్బులు హైదరాబాద్‌లో వేస్తే ఇవాళ మీ ఫోన్‌లు టింగ్ టింగ్‌న మోగుతున్నాయి. మధ్యలో దళారీ దరఖాస్తు లేదు. లంచం ఇచ్చేది లేదు. ఇది జరిగుతుంఉంది ఇప్పుడు. ధరణి తీసేస్తే మళ్లా అదే దళారీ రాజ్యం రావాల్నా.. ఇదే ప్రశాంత రాజ్యాం ఉండాల్నా..? అనేది ఆలోచించాలని కేసీఆర్ సూచించారు