ఎన్నికల్లో విచక్షణ జ్ఞానంతో ఓటు వేయాలి.. లేదంటే ఐదేండ్లు బాధపడాల్సి వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సరైన పార్టీకి ఓటు వేస్తేనే సరైన భవిష్యత్ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ముథోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పార్టీ అభ్యర్థి విఠల్ రెడ్డికి మద్దతుగా కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మన దేశంలో ప్రజాస్వామ్యం వచ్చి 75 ఏండ్లు అవుతుందని కేసీఆర్ తెలిపారు. ఎన్నికలు రాగానే ఆగమాగం అవుతున్నారు. అబద్ధాలు చెప్పుడు, నిందలు వేయడం సహజమైంది. ప్రజాస్వామ్య ప్రక్రియకు రావాల్సిన పరిణితి మన దేశంలో రావడం లేదు. ఏ దేశంలో అయితే ప్రజాస్వామ్య పరిణితి వచ్చిందో ఆ దేశాలు బాగా పురోగతి చెంది ముందుకు పోతున్నాయి. ఎన్నికలు చాలా వస్తాయి. చాలా పోతాయి. ఓట్లు పడుతాయి. ఎవరో ఒకరు గెలుస్తరు. పార్టీకి ఒక్కరే నిలబడుతారు. బీఆర్ఎస్ తరపున విఠల్ రెడ్డి ఉన్నారు. వేరే పార్టీలో కూడా ఎవరో ఒకరు ఉంటారు. 30న ఓట్లు వేస్తరు. 3న లెక్క అయిపోతాయి. ఎవరో ఒకరు గెలుస్తరు. అది తప్పదు అని కేసీఆర్ అన్నారు.
కానీ మీ బిడ్డగా తెలంగాణ తెచ్చిన నాయకుడిగా, బాధ్యత ఉంది కాబట్టి చెబుతున్నా.. ఎందంటే.. ఎన్నికల్లో ఒక వ్యక్తి నిలబడుతాడు. మంచి, చెడు, అతని గుణగణాలు ఆలోచించాలి. అంతే కాకుండా ఆ వ్యక్తి వెనుకాల ఏ పార్టీ ఉంది. పార్టీకి చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ఏందో మీకు తెలుసు. ప్రజలు, రైతుల గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఆలోచించాలి. ఇవన్నీ మీరు విచారించి ఓటు వేయాలి. అలాంటప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతంది. విచక్షణ జ్ఞానంతో ఓటు వేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఉంటే వజ్రాయుధం ఓటు. సరైన పార్టీకి ఓటేస్తేనే భవిష్యత్ సరైన పద్ధతిలో ఉంటుంది. లేదంటే వచ్చే ఐదేండ్లు బాధపడాలి అని కేసీఆర్ అన్నారు.
అందుకే మీరందరూ నేను చెప్పే మాటలను గ్రామాల్లో చర్చ పెట్టాలి అని సీఎం సూచించారు. పార్టీ వైఖరి, దృక్పథం, నడవడి గురించి ఆలోచించి పరిగణనలోకి తీసుకొని ఓటు వేయాలి. సరైన ప్రభుత్వం ఏర్పడితేనే మనం మంచిగా ఉంటాం. లేదంటే మనం దెబ్బతింటాం. ఒకసారి ఓటు చేతిలో నుంచి జారిపోతే చేసేదేమీ ఉండదు. ఐదేండ్ల దాకా ఏం చేయలేం. ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఓటు వేయాలి అని కేసీఆర్ కోరారు.