తెలంగాణ రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్రసమితి (బీఆర్‌ఎస్) తిరుగులేని విజయం సాధిస్తుందని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. మళ్లీ అధికారం బీఆర్‌ఎస్‌దేనని, కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని వెల్లడిస్తున్నాయి. ఓటర్లు ఇప్పటికే ఈ దిశగా డిసైడ్ అయ్యారని, ప్రజాభిప్రాయం ఇదే తీరులో ఉందని ఇప్పటికే ఇండియా టీవీ, మిషన్ చాణక్య, ఎన్‌పీఐ సర్వేలు తేల్చిచెప్పాయి.
తాజాగా, మరో రెండు సర్వేలు సైతం అధికార బీఆర్‌ఎస్ ఘన విజయాన్ని నమోదుచేయబోతున్నట్టు ప్రకటించాయి. ఈఎన్ టీవీ సర్వేలో బీఆర్‌ఎస్ 67 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకుంటుందని తేలింది. విపక్ష కాంగ్రెస్ పార్టీ 39 సీట్లతోనే సరిపెట్టుకోనున్నది.బీజేపీ 6 సీట్లకు పరిమితంకానుండగా, ఎంఐఎం 7 సీట్లను నిలుపుకోనున్నది. అక్టోబర్ 20 వరకు ప్రజాభిప్రాయాన్ని సేకరించిన ఈఎన్ టీవీ ఆయా సర్వే ఫలితాలను ఆదివారం విడుదల చేసింది.
జిల్లాలవారీగా తీసుకుంటే అన్ని జిల్లాల్లోను బీఆర్‌ఎస్ సింహభాగం సీట్లను కైవసం చేసుకొంటుందని ఈ సర్వేలో తేలింది. రంగారెడ్డి జిల్లాలో 14 సెగ్మెంట్లకు 11 సీట్లు, మెదక్‌లో 7, వరంగల్‌లో 8 చొప్పున సీట్లను కైవసం చేసుకొని పట్టు నిలుపుకోనున్నదని వెల్లడైంది. ప్రముఖ జర్నలిస్ట్ దినేశ్‌కుమార్ ఒపీనియన్ పోల్‌లోనూ బీఆర్‌ఎస్ 67 -74 సీట్లు దక్కించుకోనున్నదని తేలింది.