ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ఎంత విలువైందో తెలిపే సినిమా డైలాగ్ ఇది. సినిమా డైలాగే కదా! అని మీరు తేలిగ్గా తీసిపారే యొచ్చు. కానీ ఓటమి అంచులదాకా వెళ్లి బయటపడ్డ నేతలను అడిగితే తెలుస్తుంది.. ఆ డైలాగ్ విలువ.. ఓటు విలువా. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమే. ఒక్క ఓటే గెలుపోటములను నిర్ణయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి తెలంగాణ వరకు గత నాలుగు అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే ఇదే విషయం అవగతం అవుతున్నది. 2 వేలలోపు ఓట్ల మెజారిటీతో అనేకమంది గెలుపొందారు. 2004లో నలుగురు, 2009లో 13 మంది, 2014లో ముగ్గురు, 2018లో ఆరుగురు స్వల్ప తేడాతో ఓటమిని తప్పించుకున్నారు. తన సమీప ప్రత్యర్థిపై 78 ఓట్ల ఆధిక్యంతో కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి గెలుపొందారు.
ఈ రెండు దశాబ్దాల రికార్డులను పరిశీలిస్తే ఇదే అత్యల్ప మెజారిటీ కావడం గమనార్హం. పోలింగ్ బూత్‌కు ఒకటి రెండు ఓట్ల తేడా వచ్చినా ఫలితం తారుమారు అవుతుంది. ఎన్నికల్లో పోల్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యమై నదని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఓటు విలువ తెలుసు కాబట్టే ఈసీతోపాటు అన్ని పార్టీలూ ఓటర్లను పోలింగ్ బూత్‌కు రప్పించి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నాయి.