తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని, కండ్లముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఆలోచన చేయాలని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని చేర్యాల మండలం, వేచరేణి గ్రామంలో పర్యటించారు. గ్రామాల్లో మహిళలు ఆయనకు హారతిచ్చి, తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ ఆయన ప్రచారం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అలవికానీ హామీలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తుందన్నారు. ఆ పార్టీని నమ్ముకుంటే కరెంట్ కోతలు తప్పవన్నారు. ఇన్నేండ్లు అధికారంలో ఉండి చేయని అభివృద్ధి ఇప్పుడు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించాలని, అభివృద్ధిని చేసి చూపిస్తానని హామీనిచ్చారు. ఓటర్లే తన దేవుళ్లని, తాను పూజారిగా సేవలు చేసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.