గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ తన జన్మదినం సందర్భంగా రవీంద్రభారతి ప్రాంగణంలో చెట్లు నాటారు.
పర్యావరణ పరిరక్షనకు, మానవాళి సుఖవంతమైన జీవితానికి, సకల జీవుల కొనసాగింపుకు, జీవ వైవిధ్యత భూమిపై విలసిల్లడానికి చెట్లు ఆధారంగా నిలుస్తాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా హరితావరణాన్ని పెంచేందుకు కృషి చేస్తున్న పర్యావరణ వేత్తలకు, వన సంరక్షకులకు ఆకుపచ్చని అవని కోసం తపిస్తున్న ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఇలాంటి ఉద్యమిత్వ స్వభావమే తెలంగాణా రాష్ట్రాన్ని పదేళ్ళ స్వల్ప కాలంలోనే ఆకుపచ్చని తెలంగాణాగా మార్చిందని ఆయన గుర్తు చేసారు. మహిళలందరు కలిసి ప్రకృతికి ధన్యవాదాలు చెప్పే పూల పండుగ బతుకమ్మ కూడా పర్యావరణ స్పృహను ప్రజలలో కలిగించే పండుగేనని, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తున్నది బతుకమ్మ పండుగ అని, ఈ సందర్భంగా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు.