ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్, BJP పార్టీల నేతలకు ప్రజలు గుర్తుకొస్తారని సనత్ నగర్ నియోజకవర్గ BRS పార్టీ MLA అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. గురువారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మొండా మార్కెట్ డివిజన్ లో పాదయాత్ర ద్వారా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొదటిరోజు ప్రచారంలో బండిమెట్, మారుతివీది, నాలా బజార్, ఓల్డ్ జైల్ ఖానా తదితర ప్రాంతాలలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. ప్రచారం ప్రారంభం నుండి చివరి వరకు మంత్రికి అడుగడుగునా బ్రహ్మరధం పట్టారు. బతుకమ్మలు, డప్పు చప్పుళ్ళతో ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టి మంత్రికి నుదుటన తిలకం దిద్దారు.
భవనాల పై నుండి మంత్రి పైకి పూలవర్షం కురిపించారు. ఆయన ను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. తమ సమస్యలు పరిష్కరించిన, తమ బతుకుల్లో వెలుగులు నింపిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తమ ఓటు కారు గుర్తుకే అని మద్దతు తెలిపారు. పాదయాత్ర, ప్రచారంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ లకు చెందిన కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, డివిజన్ అద్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతినెల పెన్షన్ క్రింద ఆర్ధిక సహాయం అందిస్తూ తమ గౌరవాన్ని మరింత పెంచిందని పలువురు వృద్దులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో 50 సంవత్సరాలలో జరగని అభివృద్దిని 10 సంవత్సరాల కాలంలో చేశామని చెప్పారు. గతంలో ఇక్కడి నుండి గెలుపొంది ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, మంత్రులుగా చేసిన వారు సైతం చేయలేని అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సహకారంతో చేసినట్లు తెలిపారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్తను అభివృద్ధి చేశామని, త్రాగునీటి సమస్యను కూడా పరిష్కరించామని చెప్పారు. చేసిన అనేక అభివృద్ధి పనులు కండ్ల ముందే ఉన్నాయని, ముమ్మాటికి గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు చూపెడుతున్న ఆదరణ చూస్తుంటే భారీ మెజారిటీతో ఘన విజయం ఖాయమని అన్నారు.