తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ మూడోసారి అఖండ విజయం సాధించి ప్రభుత్వం అధికారంలోకి రావాలని… వారి అడుగుజాడల్లో తాము పనిచేసేందుకు మరోసారి అవకాశం కల్పించాలని కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వేడుకున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
సోమవారం నాడు స్వామి వారి దర్శనం అనంతరం స్థానిక మీడియాతో మంత్రి మాట్లాడారు… సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీ ఫాం అందుకున్న అనంతరం నేరుగా తిరుమల వచ్చి స్వామి వారి దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ వెంట నడిచామని, ప్రస్తుతం రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి అడుగుజాడల్లో నడుస్తున్నామని అన్నారు. భవిష్యత్తులోనూ వారితోపాటు కలిసి పనిచేసే అవకాశం కల్పించాలని భగవంతుణ్ణి వేడుకున్నట్లు తెలిపారు.
దేశానికే అన్నపూర్ణగా మారిన తెలంగాణలో పేదరిక నిర్మూలనలో ఆదర్శ రాష్ట్రంగా మారిందన్నారు. పేద, బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలిచిన రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కెసిఆర్ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ అన్ని రంగాల్లోనూ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. మంత్రి వెంట తెలంగాణ పర్యటకశాఖ ఎండి మనోహర్, మహబూబ్ నగర్ జిల్లా గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శాంతయ్య యాదవ్, బీఆర్ఎస్-కేవీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ ఉన్నారు.