తెలంగాణలో ప్రజా సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన కేసీఆర్ సరారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తముఖ్యమంత్రి మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దసరా కానుకగా, అక్టోబర్ 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని తరగతుల విద్యార్థులకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ అందించనున్నారు. విద్యార్థులకు చకని బోధనతోపాటు మంచి పోషకాహారం అందించే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్నది. తద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతోపాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఇకపై వారి ఇంట్లో ఒంటిపూటే తింటారు. సీఎం అల్పాహార పథకం ప్రారంభమయ్యాక విద్యార్థులు నేరుగా బడికి వచ్చి అల్పహారం, మధ్యాహ్న భోజనం ఇలా రెండు పూటలా బడిలోనే కడుపు నింపుకొంటారు. రాష్ట్రవ్యాప్తంగా 28,807 స్కూళ్లలో 23,05,801 మంది చిన్నారులు బ్రేక్‌ఫాస్ట్ ద్వారా లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలలతోపాటు, ఎయిడెడ్, మాడల్ స్కూళ్లు, మదర్సాల్లోని విద్యార్థులకు సైతం బ్రేక్‌ఫాస్ట్‌ను సమకూర్చనున్నారు.
సీఎం మానవీయత
————————————
తమిళనాడులో విజయవంతంగా అమలవుతున్న విద్యార్థుల అల్పాహార పథకాన్ని పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ ఉన్నతాధికారుల బృందాన్ని ఇటీవల అక్కడికి పంపారు. సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్డీ ప్రియాంకవర్గీస్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ భారతి హొలికేరి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తుతో కూడిన ఉన్నతాధికారుల బృందం తమిళనాడులో పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న అల్పాహార విధానాన్ని అధ్యయనం చేసింది. ఆ రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు మాత్రమే అల్పాహారాన్ని అందిస్తున్నారు. ఆ నివేదికను పరిశీలించిన సీఎం కేసీఆర్ సర్కార్ ‘పాఠశాలల్లోని అన్ని స్థాయిల్లో విద్యార్థులకు అల్పాహారం పెడదాం. ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికి పెట్టి మరొకరికి పెట్టకుండా ఉండటం ఆ ఇంటికే కాదు రాష్ర్టానికి మంచిది కాదు. చాలా చోట్ల ప్రైమరీ, హైస్కూల్స్ ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. అక్కడ కొన్ని తరగతుల విద్యార్థులకు పెట్టి మరికొందరికి పెట్టకుండా ఉంటే ఇంట్లో పదిమంది ఉంటే నలుగురికే అన్నం పెట్టినట్టు ఉంటది’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. మానవీయ కోణంలో ఆలోచించిన సీఎం ఖర్చుకు వెనకాడకుండా ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కూడా బ్రేక్‌ఫాస్ట్‌ను అందచేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రతియేటా దాదాపు రూ. 400 కోట్లు ఖర్చు చేయనున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.
బ్రేక్‌ఫాస్ట్ మెనూలో కిచిడీ, పొంగల్, ఉప్మా
————————————————-
సీఎం బ్రేక్‌ఫాస్ట్ మెనూను ఖరారు చేయడంపై విద్యాశాఖ దృష్టిసారించింది. రవ్వ ఉప్మా, పొంగల్, కేసరి, కిచిడీ వంటి పదార్థాలతో కూడిన మెనూను అధికారులు పరిశీలిస్తున్నారు. పల్లి చట్నీ, సాంబార్ సైతం వడ్డించనున్నారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ పోషకాహారంగా అందిస్తున్న రాగిజావ, ఉడికించిన కోడిగుడ్ల పంపిణీ యథాతథంగా కొనసాగుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. పాఠశాల ప్రారంభానికి ముందే రాగిజావను అందించనుండగా, మధ్యాహ్న భోజనానికి, రాగిజావకు మధ్యలో బ్రేక్‌ఫాస్ట్‌ను అందజేయనున్నారు. మధ్యాహ్న భోజనం రెండు గంటల తరువాత అందించాలని యోచిస్తున్నారు.