మామూలుగా పెద్దింటి అమ్మాయి, పేదింటి కుర్రాడిని పెళ్లి చేసుకోవడం ఏ తల్లిదండ్రులకు ఇష్టం ఉండదూ..పైగా కులాంతర వివాహం అయితే ఇక అంతే సంగతులు..అమ్మాయి మనసు అర్థం చేసుకోకుండా…బెదిరించి..తాము చూసిన సంబంధం చేయడమో లేదా..కూతురు ప్రేమించిన వ్యక్తిని భౌతికంగా అంతం చేయడమో..లేదా తమ బిడ్డ ఆ యువకుడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటే..పరువు హత్యలకు పాల్పడడమో చేస్తుంటారు..ఇక రాజకీయనాయకుల ఇళ్లలో ఇలాంటి ప్రేమ పెళ్లిళ్లను అంగీకరించే సమస్యే ఉండదు..అయితే వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మాత్రం తమ కుమార్తెకు ప్రేమ వివాహం చేసి, అది కూడా నిరాడంబరంగా రిజిస్ట్రార్ మ్యారేజ్ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు..ఆయనే ప్రొద్దుటూరు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తన పెద్ద కుమార్తె పల్లవికి ఆదర్శ వివాహం చేశారు. రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కుమార్తె పల్లవి, కమ్మర లీలా గోపి పవన్‌కుమార్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరు అయిప్పటికీ వారి పెళ్లికి ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పలేదు ఆయనే స్వయంగా పల్లవి, పవన్‌కుమార్‌లను గురువారం స్థానిక బొల్లవరంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి తీసుకువెళ్లి సంప్రదాయ ప్రకారం పెళ్లి చేశారు. అనంతరం సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో వారికి రిజిష్టర్ మ్యారేజీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ తన కుమార్తె ఎంబీఏ చదివేటప్పుడు పవన్‌కుమార్‌ను ప్రేమించిందని తెలిపారు. తన కుమార్తె ఇష్ట్రపకారం మనస్ఫూ ర్తిగా ప్రేమ వివాహం చేశానని చెప్పారు. పవన్‌కుమార్ తండ్రి ఆర్టీసీలో మెకానిక్‌గా పనిచేస్తున్నారని, ఇష్టపడిన అబ్బాయితో కుమార్తె వివాహం చేశానన్న తృప్తి తనకు ఉందని వివరించారు. వాస్తవానికి ఈ వివాహాన్ని ఘనంగా చేయాలని భావించానని, అయితే తన కు మార్తె ఇందుకు అంగీకరించకపోవడంతో నిరాడంబరంగా జరిపించానని ఎమ్మెల్యే చెప్పారు. పిల్లల ప్రేమను అర్థం చేసుకోవాలేక వేరే కులం వాడిని ప్రేమించిందనే కారణంతో కర్కశంగా మారి..తమ కడుపున పుట్టిన బిడ్డలనే పొట్టన పెట్టుకుంటున్న ఈ రోజుల్లో తన పెద్ద కుమార్తెకు కులాంతర వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు పెద్దమనసుకు ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు..