ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి తుమ్మల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న తుమ్మల ఈసారి పాలేరు టికెట్ ఆశించారు. అయితే గులాబీ బాస్, సీఎం కేసీఆర్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే మళ్లీ టికెట్ ఖరారు చేశారు. దీంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన తుమ్మలకు కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క్, తుమ్మల ఆగర్భ శత్రువు అయిన పొంగులేటి సైతం ఆయన్ని కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే వైఎస్ఆర్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల తనకు పాలేరు టికెట్ ఇస్తేనే తన వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని మెలిక పెట్టింది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది.లేకుంటే షర్మిలకు సికింద్రాబాద్ టికెట్ ఇచ్చేందుకు టీ కాంగ్రెస్ సముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ షర్మిల మాత్రం పాలేరు నుంచే పోటీ చేయాలని పట్టుదలగా ఉంది..మరోవైపు కాంగ్రెస్ పార్టీతో వామపక్షాలు పొత్తుకు సిద్ధమవుతున్నాయి. తమకు కాస్తా కూస్తో బలం ఉన్న పాలేరు, భద్రాచలం, మునుగోడు టికెట్ల కోసం ఎర్రన్నలు పోటీపడుతున్నారు. ఇక తుమ్మల కూడా పాలేరు టికెట్ షరతు మీదే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా కాంగ్రెస్ లో తుమ్మల చేరికకు బ్రేకులు పడ్డాయి. ఈ నెల 6న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ లో చేరనున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది…అయితే జాతక రీత్యా ఆరో తేదీన కలిసిరాకపోవడంతో చేరికను వాయిదా వేసుకోవాలని జ్యోతిష్య పండితులు తుమ్మలకు సూచించారంట…అసలే జ్యోతిష్యాన్ని, ముహుర్తాలను తెగ ఫాలో అయ్యే తుమ్మల ఇక చేసేదేమీ లేక తన చేరికను వాయిదా వేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ను కోరినట్లు తెలుస్తుంది. దీంతో సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవం నాడు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఆ సభకు . ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సహా పార్టీ అగ్రనేతలు హాజరు కానున్నారు. అదే రోజు తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు కాంగ్రెస్ లో షర్మిల వ్యవహారం, పాలేరు అభ్యర్థిత్వం, వామపక్షాలతో పొత్తు అంశాలపై క్లారిటీ వస్తుందని తుమ్మల భావిస్తున్నారు. మరి సెప్టెంబర్ 17 న తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరుతారా…లేదా ఈలోగా ఏదైనా కీలక పరిణామాలు జరుగుతాయా లేదా అనేది చూడాలి.