బీజేపీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజకీయ భవితవ్యంపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే విజయశాంతి వంటి బీజేపీ నేతలు రాజాసింగ్ ను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించకపోవడంపై హైకమాండ్ పై అసహనం వ్యక్తం చేశారు. కాగా ఇటీవల మంత్రి హరీష్ రావును కలిసిన తర్వాత రాజాసింగ్ బీఆర్ఎస్ లోకి చేరడం ఖాయమని వార్తలు వచ్చాయి. 115 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గోషామహల్ స్థానాన్ని మాత్రం పెండింగ్ లో పెట్టారు. దీంతో రాజాసింగ్ కోసమే గోషామహల్ ను పెండింగ్ లో పెట్టారని..వార్తలు వచ్చాయి. మరోవైపు రాజాసింగ్ బీజేపీ నుంచి టికెట్ రాకుంటే కాంగ్రెస్ లో పార్టీలో చేరడం ఖాయమని వార్తలు వచ్చాయి..అయితే ఈ ప్రచారాలకు రాజాసింగ్ స్వయంగా పుల్ స్టాప్ పెట్టారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..తనకు బీజేపీ టికెట్ దక్కకపోతే రాజకీయాల నుంచి తప్పుకుని హిందూ రాజ్యం కోసం పని చేసుకుంటానే తప్పా…ఇతర పార్టీలో చేరబోయేది లేదని తేల్చి చెప్పారు. తన ప్రాణం పోయినా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో చేరేది లేదని స్పష్టం చేశారు. అలాగే ఈసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచన కూడా లేదని అన్నారు. తనపై సస్పెన్షన్ వేటు విషయంలో బీజేపీ కేంద్ర, రాష్ట్ర కమిటీలు సానుకూలంగా ఉన్నాయని, సరైన సమయంలో తనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. ఇక ఎంపీగా పోటీ చేస్తారనే వార్తలపై స్పందిస్తూ..తొలుత తాను గోషామహల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ టికెట్ దక్కకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరి బీజేపీ హైకమాండ్ రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ వేటు ఎత్తేసి, గోషామహల్ టికెట్ ఇస్తుందో లేదో చూడాలి.
