AP Politics:ఏపీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ నేడు నగరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పేదల పిల్లలు చదువుల కోసం ఇబ్బంది పడకూడదనే విద్యా దీవెన పథకం తీసుకొచ్చామన్నారు. కాగా ఇప్పుడు 8 లక్షల 44 వేల 336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 680 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా గత నాలుగేళ్ల కాలంలోనే రూ. 11,300 కోట్లు జమ చేశామని.. విద్యార్థుల చదువుల కోసం వారి తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని అన్నారు.
పేద విద్యార్థుల పెద్ద చదువులకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నామని చెప్పారు. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మార్చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని, బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ తీసుకొచ్చామని చెప్పారు. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అమలు చేస్తున్నట్టుగా తెలిపారు. 8వ తరగతి నుంచే విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నామని చెప్పారు. రోజుకో మెనూలో ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం పెడుతున్నామని తెలిపారు. కాలేజీల్లో అదనపు ఫీజులు అడిగితే సీఎంవోకు కాల్ చేయాలని సూచించారు.
అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డి అయినా తింటారు. 28 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయ్యాడు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన పేరు చెబితే ఒక్క పథకమైనా కనిపిస్తుందా? ఏ ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. గతానికి, నాలుగేళ్ల జగన్ పాలనకు తేడా ఉందా? లేదా? అని ఆలోచన చేయాలని కోరారు. చంద్రబాబు ఎలాంటి వ్యక్తో ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. చంద్రబాబు ఏ రోజైనా మాట నిలబెట్టుకున్నాడా? అనేది ఆలోచన చేయాలన్నారు.
ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం విధించింది. పాఠశాలలకు విద్యార్థులు ఫోన్లను తీసుకురాకుండా ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులు సైతం తమ ఫోన్లను తరగతి గదుల్లోకి తీసుకురాకూడదని ఆదేశించింది. తరగతి గదులకు వెళ్లే ముందు ఉపాధ్యాయులు తన ఫోన్లను ప్రధానోపాధ్యాయుడికి అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. బోధనకు ఎలాంటి ఆటంకం రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించే ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.