సొంత ఇలాకాలో సీఎం జగన్ భారీ బహిరంగ సభతో మంత్రి ఆర్కే రోజా సత్తా చాటారు. ఇవాళ జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా చిత్తూరు జిల్లా నగరిలో ఏర్పాటు చేసిన భారీ బహరంగ సభలో సీఎం జగన్ స్వయంగా బటన్ నొక్కి ఈ విద్యాసంవత్సరానికి గాను నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా నగరిలో జగనన్న సౌండింగ్ ఇస్తే అక్కడ చంద్రబాబు గుండెల్లో రీ సౌండింగ్ రావాలంటూ..మంత్రి ఆర్కే రోజా ఇచ్చిన స్పీచ్ కు బహిరంగ సభ దద్దరిల్లింది. జగనన్న విద్యానిధి పథకం మూడో విడత నిధులు విడుదల చేసేందుకు తొలిసారిగా నగరికి విచ్చేసిన సీఎం జగన్ కు అభినందనలు తెలిపారు.తెలిపారు. రాఖీ పండుగను పురస్కరించుకుని రెండు రోజుల ముందే నగరికి వచ్చిన జగనన్నకు మంత్రి రోజా స్వయంగా రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ రోజు ఆటో డ్రైవర్ కూతురు ఆటో మొబైల్ ఇంజనీరింగ్, రైతు బిడ్డ, వ్యవసాయ శాస్త్రవేత్త, మెకానిక్ కొడుకు మెకానికల్ ఇంజనీరింగ్ , కంపౌండర్ కూతురు డాక్టర్ చదువుతున్నారంటే ముమ్మాటికీ సీఎం జగన్ వల్లే అంటూ రోజా కొనియాడారు. అన్నపార్టీలో ఒక సైనికురాలిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని రోజా అన్నారు. అన్నదానం ఆకలి తీర్చితే..అక్షరదానం అజ్ఞానాన్ని తొలగిస్తుందంటారు..ఆకలి తీర్చాలన్నా, అజ్ఞానాన్ని తొలగించాలన్నా పేదరిక నిర్మూలన జరగాలన్నా అది విద్యతోనే సాధ్యమని మనస్ఫూర్తిగా నమ్మారు కాబట్టే..ప్రతి పేదవాడి బిడ్డను గొప్ప చదువులు చదివేందుకు సీఎం జగన్ అండగా నిలబడ్డారని మంత్రి రోజా అన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై మంత్రి రోజా నిప్పులు చెరిగారు. ఇంటర్ లో తాను ఏ గ్రూపు చదివాడో కూడా పవన్ కల్యాణ్ కు తెలియదని ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు బైపీసీ చదివితే ఇంజనీరింగ్ అవ్వొచ్చని అంటాడని…పవన్, చంద్రబాబులకు విద్యాకానుక ఇవ్వాలని చురకలంటించారు. విద్యాదీవెనతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు మంచి చదువు చెప్పించాలని సెటైర్లు వేశారు. టీడీపీని నమ్మితే యువత జైలుకు వెళ్తారని, పవన్ ని నమ్మితే కొత్త సినిమా రిలీజ్ లకు వెళతారని, అదే సీఎం జగన్ ని నమ్ముకుంటే మంచి కాలేజీలు, వర్సిటీలకు వెళతారంటూ రోజా తనదైన శైలిలో దుమ్మురేపారు. 2024 లో మళ్లీ జగనన్న సీఎం కావడం, వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు.
అసలు వైఎస్ జగన్ ని ఓడించేవాడు ఇంకా పుట్టలేదంటూ పరోక్షంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు కౌంటర్ ఇచ్చారు. జగన్ ని ఓడించాలంటే అవతలవైపు కూడా జగనే ఉండాలని అన్నారు. అసలు రెండు చోట్ల పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవలేని వాడు వైఎస్ జగన్ ని ఎలా ఓడిస్తాడని పరోక్షంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు. ప్రజలంతా 2024 లో జగనన్న వన్స్ మోర్ అంటున్నారని, రాష్ట్రంలోని 175 సీట్లు ఇచ్చి దీవించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని రోజా ధీమా వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు ఇలాకా కుప్పంలో సంక్షేమ పథకాలు ఎవరి హయాంలో అందాయని మంత్రి రోజా ప్రశ్నించారు.
కుప్పంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందించిన ఘనత సీఎం జగన్ దే అని అన్నారు. కుప్పంలో జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీ చతికిలపడిందని, వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు చేతికి చిప్ప తప్పదని ఎద్దేవా చేశారు. వారంటీలేని చంద్రబాబు ఫ్యూరిటీ ఇస్తే మనకు గ్యారంటీ ఉంటుందా అంటూ ప్రాస డైలాగులతో రోజా చెలరేగిపోయారు. మనకు జగనన్న లాంటి రియల్ హీరో కావాలా..చంద్రబాబు దత్తపుత్రుడైన రీల్ హీరో కావాలా అంటూ పరోక్షంగా పవన్ కల్యాణ్ ని ఉద్దేశిస్తూ రోజా ప్రజలను ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు మళ్లీ ప్రజలే బుద్ధి చెబుతారని, మళ్లీ బంపర్ విక్టరీతో జగన్ సీఎం అవుతారని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా సీఎం జగన్ సమక్షంలో మంత్రి రోజా ఫుల్ జోష్ తో ఇచ్చిన స్పీచ్ తో నగరి బహిరంగ సభ దద్దరిల్లిపోయిందనే చెప్పాలి.