గులాబీ బాస్, సీఎం కేసీఆర్ అందరికంటే ముందుగా 115 నియోజకవర్గాల అభ‌్యర్థులను ప్రకటించి ఎన్నికల భేరీ మోగించడంతో అధికార బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాంచి జోష్ మీద ఉన్నాయి..అయితే గులాబీ బాస్ కేసీఆర్ ముందుగా అభ్యర్థులను ప్రకటించడంతో అధికార బీఆర్ఎస్ అభ్యర్థులకు గాలం వేద్దామన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలినట్లైంది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తులు వందలాదిగా వెల్లువెత్తుతుండడంతో ఎవరికి సీటు ఇవ్వకపోయినా కష్టమే అని కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా రాజీనామాల పర్వం మొదలైంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కీలక కాంగ్రెస్ నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. మాజీ మంత్రి జూపల్లి కాంగ్రెస్ లో చేరడంతో కొల్లాపూర్ లో హస్తం పార్టీ కకావికలం అవుతోంది.
ఇప్పటికే జూపల్లి కృష్ణారావు రాకను సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతపల్లి జగదీశ్వర్ రావు తీవ్రంగా వ్యతిరేకించారు.గత ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బీరం హర్షవర్థన్ రెడ్డి గెలిచిన తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించారు. దీంతో అక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ చింతపల్లి జగదీశ్వర్ రావు టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. జగదీశ్వర్ రావుతో పాటు , కొల్లాపూర్ వాసి, పీసీసీ ప్రధాన కార్యదర్శి అభిలాషరావు కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన అభిలాషరావు వివిధ కార్యక్రమాలతో కొల్లాపూర్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేశారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ ను వీడడంతో చెల్లచెదురైనా పార్టీ కార్యకర్తలను ఒక్కతాటిపై తెచ్చి వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు.దీంతో పాటు అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీని బలోపేతం చేస్తున్న సీనియర్ నేత చింతపల్లి జగదీశ్వర్ రావుతో టికెట్ రేసులో పోటీ పడ్డారు.
అయితే ఇప్పుడు జూపల్లి చేరికతో కొల్లాపూర్ కాంగ్రెస్ 3 వర్గాలుగా చీలిపోయింది. అయితే జూపల్లి రాకను జగదీశ్వర్ రావు వ్యతిరేకించినా అభిలాషరావు మాత్రం జూపల్లితో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారు. కానీ జాపల్లి తమకు గానీ, వర్గానికి గాని ప్రాధాన్యతను ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ అభిలాషరావు కినుక వహించారు. గత పది రోజుల నుండి అభిలాష్ రావు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల తన అనుచర వర్గంతో సమీక్ష సమావేశం నిర్వహించి కాంగ్రెస్ కు రాజీనామా చేసే విషయమై సమాలోచనలు చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రులు చిన్నారెడ్డి, జూపల్లి అభిలాష్ రావును నచ్చ చెప్పే ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు..
తాజాగా అభిలాష్ రావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చినీయాంశం అయింది. త్వరలోనే ఆయన అధికార బీఆర్‌ఎస్ లో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా జూపల్లి రాకతో కాంగ్రెస్ కంచుకోట కొల్లాపూర్ బీటలు వారుతుండడంతో పీసీసీ రేవంత్ రెడ్డికి షాకింగ్ గా మారింది. మరోవైపు జూపల్లికి టికెట్ ఇస్తే చింతపల్లి జగదీశ్వర్ రావు సైతం కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థి బీరం హర్షవర్థన్ రెడ్డి మరోసారి గెలవడం ఖాయమని కొల్లాపూర్ లో చర్చ జరుగుతోంది.