అసలే వారిది పేద కుటుంబం. నలుగురు సంతానం. అంద రూ పుట్టుకతోనే దివ్యాంగులు. కాళ్లు, చేతులు వంకర్లు తిరగడంతో ఏ పనీ చేసుకోలేని దయనీయ స్థితి. కుటుంబం గడవడమే కష్టమైన దుస్థితి. ఏ దిక్కూ లేనివారికి దేవుడే దిక్కు అంటారు.. ఇప్పుడు ఆ కుటుంబానికి కేసీఆరే దేవుడైండు. ఆ కుటుంబాన్ని సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఆసరా’ అక్కున చేర్చుకున్నది. నలుగురు దివ్యాంగులతోపాటు ఒకరికి వృద్ధాప్య పింఛను అందుతున్నది.
వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన గుండ్ల నర్సయ్య, లక్ష్మమ్మకు నలుగురు సంతానం. ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. అందరూ పుట్టుకతోనే దివ్యాంగులు. కాళ్లు, చేతులు వంకర్లు తిరగడంతో ఏపనీ చేయలేరు. నర్సయ్యకు వయస్సు మీద పడటంతో తల్లి లక్ష్మమ్మ కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని సాకుతున్నది.
సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ఆసరా పథకం ఆ కుటుంబానికి పెద్ద ఆసరా మారింది. నలుగురు దివ్యాంగులతోపాటు తండ్రికి కూడా వృద్ధాప్య పింఛను అందుతున్నది. ఇటీవలి వరకు ప్రతినెలా రూ.14,080 పింఛన్ రూపంలో అందేవి. రూ.3,016 దివ్యాంగుల పింఛన్‌ను సీఎం కేసీఆర్ ఇటీవల రూ.4,016 వేలకు పెంచడంతో ఇప్పుడు వారికి రూ.18,080 పింఛను అందుతున్నది. గురువారం స్థానిక పోస్టాఫీస్ నుంచి పెంచిన పింఛను డబ్బు మొత్తం 18,080 రూపాయలు తీసుకొని మురిసిపోయారు. ‘కేసీఆర్ సార్ లేకుంటే మా బతుకులు ఆగమయ్యేవి. తెలంగాణ ప్రభుత్వం రాకముందుకు మా రెక్కల కష్టం మీద నలుగురు పిల్లలను సాకడం కష్టంగా ఉండేది. పింఛన్ అరకొరే ఇచ్చేది. సరిగ్గా అన్నం కూడా ఉండకపోయేది. ఆకలితో అలమటించిన రోజులున్నాయి. కేసీఆర్ సారు పింఛన్ పెంచి మాలాంటి కుటుంబాలకు దేవుడైండు’ అని లక్ష్మమ్మ చెప్పుకొచ్చింది.