తెలంగాణవ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి కేసీఆర్ సర్కార్ సిద్ధమవుతోంది. మరో 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి…అక్టోబర్ రెండో వారంలో ఎన్నికల కోడ్ వచ్చేలోపు డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 87 వేల డబుల్‌బెడ్రూం ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో 75 వేల పైచిలుకు ఉండగా, మిగిలిన 12 వేల ఇండ్లు ఇతర పట్టణాలు, గ్రామీణ ప్రాంతా ల్లో ఉన్నాయి. వీటిని అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్‌బెడ్రూం ఇండ్లను జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించగా.., ఇతర పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.65 లక్షల ఇండ్ల నిర్మాణం చేపట్టగా, అందులో 1.22 లక్షల ఇండ్లు పూర్తయ్యాయి.
ఇప్పటికే 34 వేల పైచిలుకు ఇండ్లను పంపిణీచేయగా, మిగిలినవాటిని పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పంపిణీ చేయాల్సిన ఇండ్లలో సింహభాగం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఇదిగా దేశంలో ఎక్కడా లేనివిధంగా నూరుశాతం సబ్సిడీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లను నిర్మించి ఇవ్వడం విశేషం.. ఇందుకుగాను గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి మౌలిక వసతులతో కలిపి రూ.6,29,000, పట్టణ ప్రాంతాల్లో రూ.6,05,000 వెచ్చించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక్కో ఇంటిపై రూ.7,75,000 నుంచి రూ.8,65,000 ఖర్చుచేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు 50%, మైనార్టీలకు 7% రిజర్వుచేయగా, పట్టణ ప్రాంతాల్లో ఎస్సీలకు 17%, ఎస్టీలకు 6%, మైనార్టీలకు 12% రిజర్వుచేశారు. కాగా ప్రతిపక్షాలు డబుల్ బెడ్ రూం ఇండ్లపై తీవ్ర విమర్శలు చేస్తున్న టైమ్ లో వారికి అవకాశం ఇవ్వకుండా మరి కొద్ది రోజుల్లో మొత్తం 87 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేసేందుకు కేసీఆర్ సర్కార్ రెడీ అవుతోంది.