ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమపథకాలకు సంబంధించి ఏదైనా కారణం చేతనైనా లబ్దిపొందని 2,62,169 మంది అర్హుల వారి ఖాతాల్లో రూ.216.34 కోట్లు జమ చేశారు. ఈ మేరకు గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ స్వయంగా బటన్ నొక్కి అర్హుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. దీంతో పాటు ఇదే సమయానికి సంబంధించి కొత్తగా అర్హత పొందిన మరో 1,49,587 మందికి పెన్షన్లు, 4,327 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 2,00, 312 మందికి రేషన్ కార్డులు, 12,069 మందికి ఇళ్ల పట్టాలను కూడా జగన్ సర్కార్ అందజేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ..అధికారం అంటే అజమాయిషీ కాదు..ప్రజల పట్ల మమకారం చూపడం…అందుకే కొత్త పెన్షన్, బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డులు అందజేస్తున్నాం. ఇప్పటి వరకు పెన్షన్ల సంఖ్య మొత్తం 64 లక్షల 27 వేలకు చేరుకుందన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో రూ. 1000 ఉన్న పెన్షన్ ఇప్పుడు రూ.2750 కి చేరిందన్నారు. జగనన్న చేదోడు ద్వారా 43,131 మందికి సాయం అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం లబ్దిదారులు మాట్లాడుతూ..సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల అమలుపై సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు ఆజన్మాంతం రుణపడి ఉంటామన్నారు.
