ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 28 న నగరిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభతో స్థానిక ఎమ్మెల్యే, ఏపీ పర్యాటక , యువజన, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న విద్యాదీవెన ఒకటి…పేద విద్యార్థులను ఉన్నత విద్యలను చదివించాలనే సమున్నత లక్ష్యంతో సీఎం జగన్ ఈ విద్యాదీవెన పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం కింద ప్రతి విద్యా సంవత్సరం ఆరంభంలో లక్షలాది మంది పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులకు 20,000 రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, ఐటీఐ స్టూడెంట్స్‌కు 10,000 రూపాయల మొత్తాన్ని వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది.
తాజాగా మరోసారి ఈ విద్యాసంవత్సరం నిమిత్తం జగనన్న విద్యాదీవెన పథకం కింద నిధులను విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.. ఈ నెల 28వ తేదీన జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులను విడుదల చేయడానికి వైఎస్ జగన్.. చిత్తూరు జిల్లా నగరికి వెళ్లనున్నారు. నగరిలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో బటన్ నొక్కి.. విద్యా దీవెన కింద నిధులను తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. సీఎం జగన్ పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లను చేపట్టింది. ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా సొంత నియోజకవర్గమైన నగరిలో వైఎస్ జగన్ బహిరంగ సభను ఏర్పాటు చేయడం, సంక్షేమ పథకంలో భాగంగా నిధులను విడుదల చేయబోతోండటం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో జగన్ భారీ బహిరంగసభను మంత్రి రోజా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే జగన్ సభ నిర్వహణ కోసం చిత్తూరులో జిల్లాకు చెందిన మంత్రులు కే నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కలెక్టర్ షన్మోహన్, పోలీస్ సూపరింటెండెంట్ రిశాంత్ రెడ్డి.. ఇతర ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. సొంత ఇలాకా లో జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభకు భారీ ఎత్తున జనాలను తరలించి, గ్రాండ్ సక్సెస్ చేసి తన సత్తా చాటాలని రోజా పట్టుదలగా ఉన్నారు. మొత్తంగా నగరిలో జరగనున్న భారీ బహిరంగ సభ సర్వత్రా ఆసక్తి రేపుతోంది.