బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు రేపుతోంది. గులాబీ బాస్, సీఎం కేసీఆర్ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ 4 సీట్లు తప్పా ఏకంగా 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించడంతో ప్రతిపక్షాలు ఖంగుతిన్నాయి. రేఖానాయక్ , మైనంపల్లి వంటి నేతలు తిరుగుబాటు చేసినా…గులాబీ పార్టీ లైట్ తీసుకుంటోంది. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాండూరు నియోజకవర్గంలో ఈసారి టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో పట్నం మహేందర్ రెడ్డిపై గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి…ఎన్నికల తర్వాత వెంటనే కారెక్కేశారు. దీంతో అప్పటి నుంచి తాండూరు బీఆర్ఎస్ లో పట్నం, పైలెట్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకరిపై ఒకరు బహిరంగంగానే దుమ్మెత్తిపోసుకున్నారు..బూతులు లంకించుకున్నారు. తాండూరులో పట్నం వర్సెస్ పైలెట్ వర్గాల మధ్య విబేధాలు బీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి.
కాగా గత ఎన్నికల్లో ఓడిపోయిన పట్నం మహేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో తాండూరులో ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే వర్గాల మధ్య విభేధాలు తీవ్రస్థాయిలో ముదిరిపోయాయి. ఈసారి ఎన్నికల్లో టికెట్ నాకే అంటే నాకే అంటూ పట్నం, పైలెట్ సవాళ్లు బహిరంగంగానే విసురుకున్నారు. దీంతో ఈసారి తాండూరులో గులాబీ బాస్ ఎవరికి అవకాశం ఇస్తారా అనేది…రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఓ దశలో పైలెట్ కే మళ్లీ టికెట్ దక్కుతుందని ప్రచారం జరగడంతో పట్నం సోదరులు కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమని, ఈమేరకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పట్నం బ్రదర్స్ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.
అయితే గులాబీ బాస్ కేసీఆర్ చాకచక్యంగా ఈ ఇష్యూకి చెక్ పెట్టారు. పట్నం మహేందర్ రెడ్డిని ప్రగతిభవన్ కు పిలిపించి బుజ్జగించిన కేసీఆర్ పైలెట్ కే టికెట్ ఖాయం చేసారు. మరోవైపు పట్నం మహేందర్ రెడ్డికి ఏకంగా కేబినెట్ లో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ 3 నెలలకే కాకుండా మళ్లీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి కంటిన్యూ అవుతుందని చెప్పినట్లు సమాచారం. దీంతో పట్నం కూల్ అయిపోయారు..అంతే తాండూరులో ఏకంగా సీన్ మారిపోయింది. మరోవైపు నిన్నటి వరకు పట్నం పేరేత్తితే శివాలెత్తిన పైలెట్ రోహిత్ రెడ్డి కూడా ఓ మెట్టు దిగారు. పట్నం ఇంటికి వెళ్లి ఎన్నికల్లో మద్దతిచ్చి తనను గెలిపించాలంటూ ఏకంగా ఆయన కాళ్లు పట్టుకుని అభ్యర్థించారు. నిన్నటి వరకు తనను బూతులు తిట్టిన పైలెట్ ఇప్పుడు ఏకంగా తన కాళ్లు పట్టుకుని ఆశీర్వదించమని కోరడంతో పట్నం మహేందర్ రెడ్డి కూడా కరిగిపోయారు. శత్రుత్వాన్ని వీడి…పైలెట్ గెలుపుకు సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా తాండూరు బీఆర్ఎస్ లో అసమ్మతి టీకప్పులో తుఫానులా చప్పున చల్లారిపోయింది. పట్నం మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డిలు కలిసిపోవడంతో ఇక తాండూరులో మళ్లీ గెలుపు పక్కా అని బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కుతున్నాయి.