తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సూర్యాపేట సభలో ఎన్నికల శంఖారావం పూరించారు. ఇవాళ 105 అభ్యర్థుల జాబితాను ప్రకటించడం ఖాయమని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అటు కాంగ్రెస్, బీజేపీలు కూడా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కాగా తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ సెకండ్ వీక్ లో రావచ్చని , పోలింగ్ నవంబర్ చివరివారం లేదా డిసెంబర్ మొదటివారంలో జరగవచ్చు అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ దాదాపు ఖరారు అయినట్లు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సమాచారం అందుతోంది. 2018లో లాగే ఈసారి కూడా మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్ రాష్ట్రాలతో కలిపి తెలంగాణ ఎన్నికలను నిర్వహించనున్నట్లు సమాచారం. అక్టోబర్ 17 కంటే ముందే ఎన్నికల షెడ్యూల్ రావొచ్చని తెలుస్తోంది. 2018లో షెడ్యూల్ రిలీజ్ అయిన 6 వారాలకు మిజోరంలో, 8 వారాలకు తెలంగాణలో పోలింగ్ నిర్వహించారు. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ తొలి రెండు వారాల్లో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది.
ఇక తెలంగాణ ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరింది. 2018 ఎన్నికల నాటికి 2.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా…. 2023 జనవరికి ఆ సంఖ్య 2.99 కోట్లకు చేరింది. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం… మొత్తం ఓటర్లలో 71% అంటే 2.12 కోట్ల మంది యువ, మహిళా ఓటర్లే ఉన్నారు. ఓటర్లలో పురుషులు 1,50,50,464 మంది మహిళలు, 1,49,25,243 మంది ఉన్నారు. అక్టోబర్ 4 న ఈసీ తుది ఓటరు జాబితాను ప్రకటించనుంది. అక్టోబర్ 15 కల్లా ఎన్నికల షెడ్యూల్ విడుదల అవడం దాదాపుగా ఖాయమైందని, ఇక సీఈసీ నుంచి లాంఛన ప్రాయంగా ప్రకటన రావడమే తరువాయి అని తెలుస్తోంది. బీఎస్పీ, తెలంగాణ జనసమితి, టీడీపీ, ఇతర చిన్నా చితక పార్టీలు ఉన్నప్పటికీ ఈసారి అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.