డా.బి.ఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గుడి,మసీదు,చర్చి నిర్మాణ ఫినిషింగ్ వర్క్స్ శనివారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. గుడి,మసీద్,చర్చి నిర్మాణ ప్రాంగణాలు కలియతిరిగారు. ఈనెల 25న సీఎం కేసిఆర్ గారు ప్రారంభించనున్న నేపథ్యంలో మిగిలిన చివరి దశ పనులు వెంటనే పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్బంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ…ఈనెల 25న సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా చర్చి రెండు మసీదులు గుడి ప్రారంభోత్సవం జరగనుందని అన్నారు. సీఎం కేసిఆర్ ఆదేశాల ప్రకారం సర్వమత సౌభ్రాతృత్వం పరిడవిల్లే విధంగా ప్రార్దన మందిరాలు నిర్మితం అయ్యాయని తెలిపారు.గతంలో కంటే నిర్మాణాలు అద్భుతంగా ఉండాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు.2300 గజాల స్థలంలో గుడి నిర్మాణం జరిగిందనీ,పనులన్నీ పూర్తయ్యాయని వెల్లడించారు.శివాలయం, పోచమ్మగుడి, హనుమాన్, గణపతి ఆలయాలు ఉన్నాయి వాటి పనులు అన్ని పూర్తయ్యాయని తెలిపారు. దేవాలయానికి సంబంధించిన విగ్రహాలను తిరుపతి నుంచి ప్రత్యేకంగా తీసుకొస్తున్నామన్నారు.యాగంతో ఈ ఆలయాలు ప్రారంభం అవుతాయన్నారు.మసీదు,చర్చి కూడా ఆయా మత పెద్దల సమక్షంలో వారి మతాచారం ప్రకారం ప్రారంభించుకుంటామని తెలిపారు.
తెలంగాణ అంటేనే గంగా జమునా తేహజిబ్ అని సర్వమత సమ్మెళితమన్నారు. అందుకే కేసిఆర్ గారు అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ గతంలో ఉన్న దానికంటే అద్భుతంగా వీటిని నిర్మించారని మంత్రి తెలిపారు.మంత్రి వెంట ఎమ్మెల్యే కాలే యాదయ్య, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డా.మధు శేఖర్, ఆర్ అండ్ బి ఈఎన్సి గణపతిరెడ్డి,ఎస్.ఈ సత్యనారాయణ, డి.ఈ లు దుర్గా ప్రసాద్,మోహన్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు,రైతు నాయకులు కోటపాటి నర్సింహ నాయుడు తదితరులు ఉన్నారు.