తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి రానురానూ దిగజారిపోతుంది.. బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత ఆ పార్టీ గ్రాఫ్ మెల్లమెల్లగా పడిపోతుంది. ఎన్నికలకు ముందు రాష్ట్ర నాయకత్వాన్ని మార్చడంతో కాషాయనేతల్లో గందరగోళం నెలకొంది. నిన్నటి వరకు అధికార బీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీకొట్టిన బీజేపీలో ఇప్పుడు స్తబ్దు నెలకొంది. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో కాషాయ నేతలు, క్యాడర్ లో పూర్తి నిరాకస్తత ఏర్పడింది. ఇక తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు లేదని భావించిన సీనియర్ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ముఖ్యంగా బీజేపీ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలో సైతం కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నేత కౌశిక్ హరి త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మరో మంత్రి హరీశ్‌రావుతో కౌశిక్ భేటీ అయ్యారు. పార్టీలో తనతోపాటు తన వర్గం నేతలు చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. కాగా ఈ చేరికల విషయంపై ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ప్రభుత్వ విప్ బాల సుమన్‌తో మంత్రులు చర్చలు జరిపారు. త్వరలోనే రామగుండంలో భారీ బహిరంగసభను ఏర్పాటు చేసి కౌశిక్ హరితో సహా పలువురు బీజేపీ కీలక నేతలు బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. సంఘటిత, అసంఘటిత కార్మిక సంఘాల నేతగా రామగుండం ప్రాంతంలో ప్రజాదరణ పొందిన కౌశిక్ హరికి ప్రజల్లో మంచి పట్టు ఉంది. 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేయగా కేవలం 1,200 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో కూడా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వలస నేతల తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్న బీజేపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా గులాబీ పార్టీకి చేరుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా సీనియర్ నేత కౌశిక్ హరి బీఆర్ఎస్ లో చేరనుండడంతో రామగుండం నియోజకవర్గంలో బీజేపీకి కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.