ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీకి మరో భారీ షాక్ తగలనుంది. ఇప్పటికే రామగుండం నియోజకవర్గంలో కీలక సీనియర్ నేత కౌశిక్ హరి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆల్రెడీ ప్రగతిభవన్ లో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లను కలిసిన కౌశిక్ హరి బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. త్వరలో రామగుండంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అనుచరులతో కలిసి కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా రామగుండం మాజీ ఎమ్మెల్యే , బీజేపీ సీనియర్ నేత సోమారపు సత్యనారాయణ సైతం పార్టీకి రాజీనామా చేయడం ఖాయమైనట్లు విశ్వసనీయ సమాచారం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన సోమారపు సత్యనారాయణ ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ తరపున అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేసిన
కోరుకంటి చందర్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఓటమి అనంతరం బీజేపీలో చేరిన సోమారపు సత్యనారాయణ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు క్యాడర్ ను సమాయాత్తం చేస్తున్నారు. కాగా బీజేపీ రాష్ట్ర నాయకత్వ మార్పిడి అనంతరం జరుగుతున్న పరిణామాలతో తెలంగాణవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ ఘోరంగా డౌన్ అయింది. వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే అని ఇక బీజేపీ మూడో ప్లేసుకే పరిమితం అని చర్చ జరుగుతోంది. దీంతో బీజేపీ సీనియర్ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేత, రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బీజేపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనుకాడుతున్నట్లు సమాచారం. తనకంటూ ఎంతో కొంత ఓటు బ్యాంకు ఉన్న సోమారపు వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తే కొన్ని వర్గాలు ఓట్లు పడవని భావిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుకుంటి చందర్, కాంగ్రెస్ అభ్యర్థి మధ్యే ప్రధాన పోటీ నెలకొన్న తరుణంలో తాను బీజేపీ నుంచి బరిలోకి దిగే కంటే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగడమే మేలని సోమారపు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గత ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ తరపున అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేయాలని సోమారపు డిసైడ్ అయ్యారంట.
సింహం గుర్తు ఇక్కడి అభ్యర్థులకు సెంటిమెంట్ గా మారింది. కార్పొరేషన్ ఎన్నికలైనా, ఎమ్మెల్యే ఎన్నికలైనా సింహం గుర్తుపై పోటీ చేస్తే గెలుపు ఖాయమని సెంటిమెంట్ బలపడింది. గత ఎన్నికల్లో సింహం గుర్తుపై పోటీ చేసిన కోరుకంటి చందర్ సీనియర్ అయిన సోమారపు సత్యనారాయణను ఓడించి సంచలనం రేపారు. ఆతర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్న కోరుకంటి ఈ సారి కారుగుర్తుపై పోటీ చేయనున్నారు. దీంతో తాను ఈసారి సింహం గుర్తుపై పోటీ చేస్తే గెలువు ఖాయమని సోమారపు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కమలం గుర్తుపై పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కే అవకాశం లేదని…అదే సింహం గుర్తుపై పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని టాక్. మరోవైపు సీనియర్ నేత వివేక్ తో వర్గ విబేధాలు కూడా సోమారపు సత్యనారాయణకు ఇబ్బందిగా మారాయి. బీజేపీ నుంచి పోటీ చేస్తే వివేక్ వర్గం తనను ఓడించేందుకు ప్రయత్నిస్తుందని…అందుకే కమలం పార్టీని వదిలేసి ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ తరపున ఎన్నికల్లో సింహం గుర్తు పోటీ చేయాలని సోమారపు ఫిక్స్ అయినట్లు సమాచారం. మొత్తంగా రామగుండంలో కౌశిక్ హరితో పాటు సోమారపు సత్యనారాయణ కూడా రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలు కాషాయపార్టీకి షాకింగ్ గా మారాయి. మరి సోమారపు సత్యనారాయణ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.