తెలంగాణ రాష్ట్రంలో వానకాలం సాగు సునాయాసంగా కోటి ఎకరాలు దాటింది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 1.02 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గతంతో పోల్చితే ఈ సారి సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నది. గత వానకాలంలో ఇదే సమయానికి 95 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈసారి 7 లక్షల ఎకరాలు అధికంగా సాగయ్యాయి. అత్యధికంగా పత్తి 44.57 లక్షల ఎకరాల్లో వేయగా, ఆ తర్వాత 41.73 లక్షల ఎకరాల్లో వరి సాగయింది.
నిరుడు ఇదే సమయానికి 30.81 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. దీంతో గతంతో పోల్చితే 11 లక్షల ఎకరాల్లో అధికంగా వరి సాగు కావడం గమనార్హం. గత వానకాలంలో రికార్డు స్థాయిలో 64.54 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. ఈసారి సుమారు 70 లక్షలకు చేరే అవకాశం ఉన్నదని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. వివిధ జిల్లాల్లో సాధారణ సాగు అంచనాకు మించి పంటలు సాగవుతున్నాయి. మెదక్ జిల్లాలో 121 శాతం సాగు కాగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో 104 శాతం సాగు కావడం విశేషం.