టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్ఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగల మధ్య ఎస్సీ వర్గీకరణ విషయమై జరుగుతున్న మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది…ఇటీవల ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వాలని కోరుతూ..కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రేకు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందించిన మంద కృష్ణ ఈ సందర్భంగా గాంధీభవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ కాంగ్రెస్ పార్టీని ఏకిపారేసారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని ప్రధాని మోడీకి లేఖ రాయాలని కాంగ్రెస్ పార్టీ నేతలను కోరినా పట్టించుకోలేదని మండిపడ్డారు. 9 ఏళ్లుగా ఈ విషయమై కాంగ్రెస్ నేతల చుట్టూ తిరుగుతున్నా కూడా ఆ పార్టీ నేతలు పట్టించుకోలేదని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేయడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని అందుకే ప్రధానికి లేఖ రాయలేదని విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు సహకరించలేదని , ఇప్పుడు 9 ఏళ్లుగా విపక్షంలో కూడ ఈ బిల్లు పెట్టాలని లేఖ రాసేందుకు కూడ కాంగ్రెస్ పార్టీకి ముందుకు రావడం లేదని, ఈ పరిస్థితుల్లో తాము ఎలా కాంగ్రెస్ కు మద్దతివ్వాలని ఆయన ప్రశ్నించారు.
అయితే మంద కృష్ణ మాదిగ విమర్శలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని, అయినా ఒకరికి మద్దతిచ్చి…వేరొకరిని ప్రశ్నించడం సరికాదని మంద కృష్ణకు చురకలు అంటించాడు. దీంతో మళ్లీ మీడియా ముందుకు వచ్చిన మంద కృష్ణ మాదిగ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్సీ వర్గీకరణ చేయాల్సిన పార్లమెంట్ లో రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడకుండా…ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే మేమైనా చెవిలో పువ్వులు పెట్టుకున్నామా అని ఫైర్ అయ్యారు.
అంతేకాదు రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే రేవంత్ రెడ్డి బీజేపీ లేదా బీఆర్ఎస్ లో చేరతాడని తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి తన ఒంటి మీద మూడు కండువాలు మార్చాడని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఆరెస్సెస్ భావజాలాన్ని వినిపిస్తున్నాడని, గతంలో కూడా బీజేపీ అనుబంధ సంస్థలో ఉండేవాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని రేవంత్ రెడ్డి మాటలకు ఏం విలువ ఉంటుంది…ఇలాంటి వాడి మాటలను తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారంటూ , ముఖ్యంగా దళితులు ఎలా నమ్ముతారంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కూడా నేను ఆరెస్సెస్ వాదిని అంటూ చెప్పుకున్న రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే కచ్చితంగా కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరడం ఖాయమని మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యలను ఉటంకిస్తూ సోషల్ మీడియాలో నెట్‌జన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.