నిండా పదేండ్లు కూడా నిండని తెలంగాణ దేశంలో ఏండ్లకొద్దీ ఆర్థికంగా పటిష్టంగా నిలిచిన మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలను అధిగమిస్తూ టాప్ ర్యాంకునకు దూసుకుపోతున్నది. రంగం ఏదైనా, పోటీలో ఆర్థికంగా స్థిరత్వం కలిగి అన్ని రకాల వనరులున్న రాష్ట్రాలున్నా వాటిని తలదన్నుతూ ముందుకు సాగుతున్నది. తలసరి ఆదాయం, ఇంటింటికీ తాగునీరు, వ్యవసాయం, వాణిజ్యం, ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు, 24 గంటల కరెంట్‌తో పాటు కేంద్ర ఆర్థిక గణాంక శాఖ తాజాగా విడుదల చేసిన పర్ క్యాపిటా నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (ఎన్ఎస్‌డీపీ)లో కూడా తెలంగాణనే అగ్రభాగాన నిలిచింది. రాష్ట్రంలో ప్రతి పౌరుడు ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంత సంపాదించాడు..? అని తెలిపేదే ఈ ఎన్ఎస్‌డీపీ. ఈ గణాంకాల ప్రకారం.. తెలంగాణ ఎన్ఎస్డీపీ 3,08,732గా ఉండగా తర్వాత కర్నాటక (3,01,673), హర్యానా (2,96,685) ఉన్నాయి. రాష్ట్రం వచ్చిన కొత్తలో తెలంగాణ ఎన్ఎస్డీపీ.. 1,24,104గా ఉండగా ఇప్పుడది ఏకంగా 150 శాతం వృద్ధి సాధించడం విశేషం.
తలసరిలో మనమే టాప్..
ఒక దేశం గానీ, రాష్ట్రం గానీ అభివృద్ధి చెందిందని చెప్పడానికి ప్రపంచవ్యాప్తంగా వాడే సూచిక ఆ దేశ లేదా రాష్ట్ర తలసరి ఆదాయం. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఈ సూచీ.. వృద్ధి దిశగా పరుగులు తీస్తూనే ఉంది. ఎంతలా అంటే.. గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణలో తలసరి ఆదాయ వృద్ధి రేటు ఏకంగా 156 శాతం పెరగడం గమనార్హం. తెలంగాణ వచ్చిన ఏడాది (2014-15 ఆర్థిక సంవత్సరంలో) రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,24,104 గా ఉండగా 2022-23 నాటికి అది రూ. 3,17,115కు చేరింది. ఇదే దేశ తలసరి ఆదాయాన్ని చూస్తే.. 2014-15లో నేషనల్ జీఎస్‌డీపీ.. రూ. 86,647గా ఉండగా 2022-23 నాటికి అది రూ. 1,72,000 మాత్రమే. 9 ఏండ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన వృద్ధి రేటు 98 శాతంగా ఉంది. గడిచిన 9 ఏండ్లలో కరోనా కోరలు చాచిన 2020-21 ఆర్థిక సంవత్సరాన్ని మినహాయిస్తే 8 ఏండ్లలో ఏనాడూ తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధిరేటు ఆగలేదు.
దేశానికి అన్నం పెట్టేదే తెలంగాణ రైతు..
వరి ఉత్పత్తిలో దేశవ్యాప్తంగా పంజాబ్ పేరిట ఉన్న రికార్డును తెలంగాణ అధిగమించింది. దేశవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఎకరాలలో వరి పంట సాగైతే అందులో దాదాపు సగం పంజాబ్ నుంచే పండేది. గడిచిన యాభై ఏండ్లుగా ఇదే పరిస్థితి. కానీ తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరంతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులతో సమైక్య పాలనలో బీళ్లుగా ఉన్న భూములు హరిత శోభను సంతరించుకుంటున్నాయి. గతేడాది 94 లక్షల ఎకరాలలో (దేశవ్యాప్తంగా) సాగైతే అందులో 56.40 లక్షలు సాగయ్యింది తెలంగాణలోనే. అంతేగాక గడిచిన పదేండ్లలో వరి ఉత్పత్తి విలువ (ప్యాడీ అవుట్‌పుట్ వాల్యూ)లో కూడా తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. 2011-12లో రూ. 8,291 కోట్లుగా ఉన్న వరి ఉత్పత్తి విలువ.. 2021-22 నాటికి 16,533 కోట్లకు పెరిగింది. ఈ విషయంలో తెలంగాణ ఏకంగా 99 శాతం వృద్ధి సాధించడం గమనార్హం.
‘పవర్ కింగ్’లం
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయంతో పాటు ఇతర రంగాలకూ నిరాటంకంగా విద్యుత్తును అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే. రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందిస్తున్న ప్రభుత్వం.. పారిశ్రామిక, గృహ అవసరాలకు కూడా అంతరాయం లేని పవర్ ఇస్తున్నది. విద్యుత్ వినియోగంలో కూడా తెలంగాణ టాప్‌లో ఉంది. 2022-23లో దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగంలో తెలంగాణ 9.5 శాతం వృద్ధి సాధించింది. రాష్ట్రంలో మొత్తం విద్యుత్ వినియోగం 1,503.65 బిలియన్ యూనిట్లకు చేరింది. ఇవి సాక్షాత్తూ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) చెప్పిన లెక్కలే.
ఐటీలో మేటి
మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఐటీ విజయాల పరంపర రాకెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నది. రాష్ట్రం ఏర్పడిన నాడు రూ. 57,258 కోట్లుగా ఉన్న తెలంగాణ ఐటీ ఎగుమతులు.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మార్చి మాసాంతానికి ఏకంగా రూ. 2,41,275 కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం (రూ. 1,83,569 కోట్లు)తో పోల్చినా రూ. 57,706 కోట్లు పెరిగింది. ఐటీ ఎగుమతుల విషయంలో తెలంగాణ.. 2023 ఆర్థిక సంవత్సరంలో జాతీయ సగటు కంటే 9.36 శాతం అధికంగా ఉంది. ఐటీలో 2022 ఆర్థిక సంవత్సరంలో 7,78,121 మంది ఉద్యోగులు ఉంటే 2022-23 నాటికి ఆ సంఖ్య 9,05,715కు పెరిగింది. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థలు గంపగుత్తగా ఉద్యోగులను తీసేస్తుంటే తెలంగాణలో మాత్రం టెకీలు కొత్తగా 1.27 లక్షల ఉద్యోగాలు సాధించుకున్నారు.
ఇవేగాక దేశంలో ఇంటింటికీ శుద్ధమైన తాగునీరు అందించే రాష్ట్రాలలో తెలంగాణ వంద శాతం నల్లాలు అందించిన రాష్ట్రంగా ఉంది. ఇంటింటికీ నల్లా నీరు అందించడంలో జాతీయ సగటు 32.54 మాత్రమ. గ్రామపంచాయతీ అవార్డులలోనూ గత పదేండ్లుగా తెలంగాణ పల్లెలు లేని ఒక్క అవార్డు కార్యక్రమం కూడా జరగలేదంటే అతిశయోక్తి కాదు. 2022లో స్వచ్ఛ సర్వేక్షణలో తెలంగాణ ఒకేరోజు ఏకంగా 14 అవార్డులు అందుకుంది. రియల్ ఎస్టేట్‌లో తెలంగాణ బూమ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. దానికి ఇటీవల కోకాపేటలో నమోదైన ధర (ఎకరం రూ. 100 కోట్లు)నే సాక్ష్యం. దేశంలో మరెక్కడా భూమికి ఇంత ధర దక్కలేదు. బుద్వేల్‌లో కూడా ఎకరం రూ. 35 కోట్ల పైమాటే. ఇవన్నీ తెలంగాణ సాధించిన విజయాలు. తొమ్మిదేండ్లలోనే యాభై ఏండ్ల అభివృద్ధి సాధించిన తెలంగాణ.. దేశానికి దిక్సూచిలా మారింది