పవన్ కళ్యాణ్ విసన్నపేట పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఎలుకను కాదు కదా వెంట్రుకను కూడా పట్టుకోలేకపోయారని సెటైర్లు వేశారు. 13 వేల కోట్ల దోపిడీ జరిగిందంటూ అర్థం లేని విమర్శలు చేశారని అమర్నాధ్ మండిపడ్డారు. ఈ మేరకు మీడియాతో సమావేశం నిర్వహించిన ఆయన పవన్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
ఇంకా మాట్లాడుతూ.. రాజకీయంగా పవన్ దిగజారిపోయారని, సీఎం జగన్ పాలనను చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. పవన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. గీతం యూనివర్సిటీ ఆక్రమణలు పవన్‌కు కనిపించలేదా అని ప్రశ్నించారు. 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ ఆక్రమణలపై ఆయన ఎందుకు నోరు మెదపడంలేదని ఫైర్ అయ్యారు.
ప్రభుత్వంపై బురద జల్లడమే పవన్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. తాను ఎవరిని ఇబ్బంది పెట్టానో చెప్పాలని.. తనలాగా అన్నను అడ్డం పెట్టుకొని రాలేదని పవన్‌కు కౌంటర్ వేశారు. 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. చిరంజీవి తమ్ముడు కాకుంటే పవన్‌ను ఎవరూ చూడరని అన్నారు. ‘పవన్ సినిమాలో హీరో అని.. సీఎం జగన్ నిజ జీవితంలో హీరో అని చెప్పారు. ఆయన్ను చూసి ఎందుకు అసూయ పడుతున్నాడో అర్థం కావడం లేదని.. సమస్యలు మీద అవగాహన ఉండాలంటే కనీసం డిగ్రీ పాస్ అవ్వాలి అని కామెంట్స్ చేశారు.
మీ నాన్న కానిస్టేబుల్ కాక ముందే మా తాత ఎమ్మెల్యే అని.. మీ అన్నయ్య పేరు చెప్పుకొని సినిమాల్లోకి వచ్చావని.. మా నాన్న రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి రాలేదు. ఆయన చనిపోయిన 18 ఏళ్లు తరవాత సీఎం జగన్ దయవల్ల ఈ స్థాయికి వచ్చానని తెలిపారు.