తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న దిగ్గజ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఫాక్స్‌కాన్ (ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ, ఎఫ్‌ఐటీ) దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఓ వైపు నిర్మాణపనులు శరవేగంగా సాగుతుండగా, మరోవైపు కంపెనీ ముందు ప్రకటించిన విధంగానే మరో రూ.3,318 (400 మిలియన్ డాలర్లు) కోట్ల అదనపు పెట్టుబడిని ప్రకటించింది.
ఇది మొదలు ప్రకటించిన రూ.1,244 (150 మిలియన్ డాలర్లు) కోట్లకు అదనం. దీంతో రాష్ట్రంలో ఫాక్స్‌కాన్ పెట్టుబడి రూ.4,562 (550 మిలియన్ డాలర్లు) కోట్లకు చేరింది. 400 మిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడి ప్రణాళికను భారత్‌లో ఫాక్స్‌కాన్ ప్రతినిధి వీ లీ తాజాగా వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత మొబైల్ ఫోన్ల సంస్థ యాపిల్‌కు ఫాక్స్‌కాన్ అతిపెద్ద సరఫరాదారు.
మొబైల్ ఫోన్లు, యాపిల్‌కు సుమారు 70 శాతం ఉత్పత్తులను ఈ సంస్థే సరఫరా చేస్తున్నది. ఇటీవలే యాపిల్ ఐపాడ్, వైర్‌లెస్ ఇయర్‌ఫోన్ల తయారీ ఆర్డర్‌ను ఫాక్స్‌కాన్ సాధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏర్పాటుచేస్తున్న పరిశ్రమలో సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తి ప్రారంభించాలని ఫాక్స్‌కాన్ నిర్ణయించింది. కంపెనీ ప్రణాళికకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కొంగరకలాన్‌లో 196 ఎకరాల భూమిని వెంటనే కేటాయించడంతోపాటు అవసరమైన అనుమతులు మంజూరుచేసింది. మే 15వ తేదీన పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, ఇప్పటికే ఫౌండేషన్ పూర్తయింది. ఈ ఏడాది మొదట్లో ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియు హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమై పెట్టుబడి ప్రణాళికపై చర్చించారు. ఈ పరిశ్రమలో 35 వేలమందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.