తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో రామగుండంలోని ఎన్టిపిసి మిలీనియం హాల్ లో నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు.సర్వసభ్య సమావేశంలో వ్యవసాయ శాఖ, జిల్లా వైద్యారోగ్య శాఖకు సంబంధించి నివేదికలను అధికారులు చదివి వినిపించారు. వ్యవసాయ శాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంబంధించి ప్రభుత్వం పని తీరు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై సర్వసభ్య సమావేశంలో చర్చించారు.
ఓదెల జడ్పిటిసి సభ్యులు ఘంటా రాములు మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపరిహారం ఎకరానికి 25 వేలు అందించాలని, మానేరు పరివాహక ప్రాంతాల్లో వరదలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో సెకండ్ గ్రేడ్ ఏఎన్ఎం లకు పర్మినెంట్ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ గతంలో జడ్పీ సమావేశాలలో త్రాగునీటి, విద్యుత్ సమస్యలతో సాగేవని, నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, సమస్యను తెలంగాణ ప్రభుత్వం శాశ్వతంగా పరిష్కరించిందని మంత్రి అన్నారు.
మిషన్ కాకతీయ క్రింద చెరువుల పూడిక తీత వల్ల సాగు విస్తీర్ణం, భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. ప్రతి మండల కేంద్రానికి రెండు, మూడు డబుల్ రోడ్లు ఉన్నాయని, గ్రామంలో పూర్తిస్థాయిలో అంతర్గత సిసి రోడ్లు వేశామని, ప్రగతి కార్యక్రమాలు, గ్రామంలో మౌళిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపొందించామని అన్నారు.ప్రభుత్వం ప్రజలకు ఉన్న అనేక సమస్యలను పరిష్కరిస్తూ వారి అభివృద్ధి సంక్షేమ దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు.ప్రకృతి వైపరీత్యాలు నియంత్రణ మన చేతిలో ఉండదని, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం అందించిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని, ఇటీవల కురిసిన వర్షాలకు సైతం ప్రభుత్వానికి నివేదిక పంపామని సానుకూలంగా స్పందించి పరిహారం అందజేయడం జరుగుతుందని అన్నారు.
సభ్యులు రాములు తెలిపిన విధంగా సెకండ్ గ్రేడ్ ఏఎన్ఎం ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, రాష్ట్రంలో ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నామని, 134 రకాల వైద్య పరీక్షలను డయాగ్నొస్టిక్ హబ్ ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్నామని, ప్రతి జిల్లా కేంద్రంలో డయాగ్నస్టిక్ హబ్ ఏర్పాటు చేశామని, దీనిపై ప్రజాప్రతినిధులు విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి అన్నారు.ఈ సమావేశంలో జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ, జడ్పీ సీఈవో శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జెడ్పిటిసిలు, వివిధ ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.