పంజాబ్‌లోని మొహాలీ ఐఎస్‌బీ క్యాంపస్‌లో నిర్వహించిన అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ కోర్సు ప్రారంభ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అభివర్ణించారు. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను అతి తక్కువ సమయంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించిందని తెలిపారు. ప్రపంచంలోనే ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 50 శాతం త్వరలో తెలంగాణ నుంచి ఉత్పత్తి కాబోతున్నాయని వివరించారు.
నేటి పరిస్థితుల్లో రాజకీయాలు సవాల్‌తో కూడుకున్నవి అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనకు వినూత్న ఆలోచనలు, పాలసీలు అత్యవసరమని వెల్లడించారు. రాజకీయ నాయకత్వానికి విజన్ ఉంటేనే ప్రగతి సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. పాలకుడికి విజన్ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం గొప్పగా పని చేస్తుందని.. మౌలిక వసతులపై పెట్టే ప్రతి పైసా పెట్టుబడి భవిష్యత్‌కు భరోసా ఇచ్చేదే అని అభిప్రాయపడ్డారు.
భారత్‌లో మాత్రం రుణాల విషయంలో అపోహలున్నాయని.. రాష్ట్రాల్లో ఆదర్శ విధానాలను నేర్చుకునేందుకు కేంద్రం చొరవ చూపాలని కోరారు. శాంతి భద్రతలను కాపాడడం భవిష్యత్‌లో అన్ని ప్రభుత్వాలకు సవాల్ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. రాజకీయాలను వృత్తిగా ఎంచుకునే అంశం ఎంతో సవాళ్లతో కూడుకుంది అని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో విభిన్న రంగాల్లో నిపుణులు రావాల్సి ఉంది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తనకు తెలంగాణ ఉద్యమం వల్ల క్షేత్రస్థాయిలో పని చేసేందుకు అవకాశం లభించింది. ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో గెలవడం యూపీఎస్సీ పరీక్ష రాసిన దానికన్నా కఠినమైనది అని కేటీఆర్ పేర్కొన్నారు.