ఇటీవల అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. కర్రలు, రాళ్లతో దాడులకు తెదేపా నేతలు, కార్యకర్తలు తెగబడ్డారు. టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నించిన పోలీసులపై కూడా విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం పోలీసుల వాహనాలకు కూడా నిప్పటించారు.
కాగా టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను జిల్లా ఎస్పీ పరామర్శించారు. అయితే ఈ ఘటనలపై తాజాగా ప్రభుత్వ సలహాదారు, వైకాపా సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలో గొడవలకు చంద్రబాబే బాధ్యత వహించాలని అన్నారు. అంగళుల్లో పథకం ప్రకారమే టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు.
టీడీపీ శ్రేణుల దాడుల్లో పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయని.. తానే శాశ్వతంగా అధికారంలో ఉండాలనే పిచ్చితో చంద్రబాబు ఉన్నారని దుయ్యబట్టారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని ఫైరయ్యారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంయమనంతో ఉన్నారని.. కానీ చంద్రబాబు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని అన్నారు. చంద్రబాబు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ.. తమ పార్టీ శ్రేణులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారన్నారు.
అంతకు ముందు చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలను కార్యకర్తలు చించేశారు. ఈ క్రమంలోనే అక్కడున్న పోలీసులను చంద్రబాబు తీవ్ర పదజాలంతో దూషించారు. గాడిదలు కాస్తారా అంటూ పోలీసులను చంద్రబాబు దూషించారు. దీనిపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.