తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. పది గంటల నుండి సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. ఐటీ ఎగుమతులపై ప్రశ్నకు మంత్రి కేటీఆర్ ఇచ్చే క్రమంలో మాట్లాడుతూ… బయట ఈ కుంభకోణం ఆ కుంభకోణం అంటూ కాంగ్రెస్ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారన్నారు.
ఈ రోజు ఎకరం భూమి ధర రూ.100 కోట్లకు రికార్డు స్థాయిలో పెరిగిందంటే ఆషామాషీ కాదన్నారు. స్టేబుల్ గవర్నమెంట్.. ఏబుల్ లీడర్ షిప్ ఉండటం వల్లే ఇది సాధ్యం అయిందన్నారు. తెలంగాణలో కులమత పంచాయితీలు లేవన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ‘‘ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన రజినీకాంత్ తాను న్యూయార్క్‌లో ఉన్నానా? హైదరాబాద్‌లో ఉన్నానో తెలియడం లేదన్నారు.
సూపర్ స్టార్ రజినీ కాంత్‌కు తెలంగాణ అభివృద్ధి కనిపిస్తోంది కానీ ప్రతిపక్ష నేతలకు కనిపించటం లేదు. ప్రతిపక్ష నేతలు కంటి వెలుగులో చూపించుకుంటే మంచిది’’ అన్నారు. ఇక సభలో ఈటల రాజేందర్‌పై కేటీఆర్ సెటైర్లు వేశారు. రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు హుజూరాబాద్‌లో ఐటీ కంపెనీ ఉండేదని.. ఇప్పుడు ఉందో లేదో తెలియదన్నారు. దీనికి ఈటల లేదని సమాధానం చెప్పారు. ‘నువ్వు బీజేపీలోకి వెళ్ళావు.. ఐటీ కంపెనీ మూత పడింది’ అంటూ సెటైర్ వేశారు.