చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి ఆప్కాబ్ కృషి చేస్తోంది అని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. కాగా ఈరోజు విజయవాడలో సీఎం జగన్ పర్యటించారు. ఈ మేరకు తాడేపల్లి సమీపంలోని ‘ఏ’ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా బ్యాంకు నూతన లోగో.. పోస్టల్ స్టాంపును సీఎం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆప్కాబ్ నిలబడిన పరిస్థితి చూస్తే గర్వంగా ఉందని.. సంస్థ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రైతులకు ఆప్కాబ్ ఇస్తున్న చేయూత ఎనలేనిదని.. విప్లవాత్మక మార్పులు ఆప్కాబ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ఆప్కాబ్‌తోనే రైతులకు బ్యాంకింగ్ వ్యవస్థ చేరువైందని.. రైతుల అభ్యున్నతికి కృషి చేసింది మహానేత వైఎస్సార్ అని గుర్తు చేశారు.
సహకార రంగ చరిత్రలో ఇదొక ప్రత్యేకమైన రోజు అని.. అందుకు కారణం ఆప్కాబ్ షష్టిపూర్తి జరుపుకోవడం అని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కోపరేటివ్ బ్యాంకు ఈ 60 సంవత్సరాల ప్రయాణం.. ఎలా ఉంది అని వెనక్కి తిరిగి చూసుకుంటే… చాలా గొప్పగా నిలబడింది అని చెప్పుకునే స్ధాయిలో ఆప్కాబ్ ఉంది. ఈ సందర్భంగా రైతన్నలకు, బ్యాంకు సిబ్బందికి, బ్యాంకును సమర్ధవంతంగా నిర్వహిస్తున్న యాజమాన్యానికి, బ్యాంకు కార్యకలాపాలలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా నా తరపున అభినందనలు తెలియజేస్తున్నాను అని అన్నారు.
భారతరైతు అప్పుల్లోనే పుడతాడు.. అప్పుల్లోనే పెరుగుతాడు.. అప్పుల్లోనే తాను చనిపోతాడనే నానుడి ఒకప్పుడు ఉండేది. కారణం ఏమిటంటే.. విత్తనం నుంచి పంట కోత వరకూ అన్నింటిలోనూ రైతులకు పెట్టుబడి అవసరం.. ఆ పెట్టుబడి అవసరం అయినప్పుడు దానికోసం రైతన్నలు అప్పు చేయాల్సి వస్తుంది. ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక అవస్ధలు పడుతున్న పరిస్థితులు వల్ల ఈ నానుడి వచ్చింది. కానీ బ్యాంకింగ్ వ్యవస్థ ఈరోజు వారికి అండగా నిలబడింది అంటూ వారి సేవలను మెచ్చుకున్నారు.