తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ.సాయన్న మృతిపట్ల అసెంబ్లీ నివాళులర్పించింది. సభలో సాయన్న మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యేతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.దివంగ ఎమ్మెల్యే సాయన్న.. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగారని, శాసన సభ్యుడిగా.. ఇతర అనేక హోదాల్లో పని చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయనతో తనకు వ్యక్తిగతంగా మంచి అనుబంధముందన్నారు. ఎటువంటి సందర్భంలోనైనా చిరునవ్వుతో చాలా ఓపికతో ఉండేవారని, అందరితో కలుపుగోలుగా ఉండేవారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారన్నారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్‌ను కలిపేందుకు ఎనలేని కృషి చేశారన్నారు. కంటోన్మెంట్ ప్రజలకు చాలా తపనపడేవారన్నారు. అనేక సందర్భాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపామని చెప్పారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి కంటోన్మెంట్లను నగరపాలికల్లో కలపాలని ఆలోచిస్తుందన్న శుభవార్త అందింది. ఆ రకంగానైనా సాయన్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నానని చెప్పారు. వివాదరహిత నేతల్లో ఆయన ఒకరని, ఆయన కూతురు సైతం నగరంలో కార్పొరేటర్‌గా సేవలందించారని తెలిపారు. సాయన్న కుటుంబం తమ కుటుంబంలాంటిదని, వారికి అండగా ఉంటామని వెల్లడించారు.అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. కాగా, మరికాసేపట్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ నేతృత్వంలో బీఏసీ సమావేశం జరుగనున్నది. ఈ సందర్భంగా సమావేశాలు ఎన్నిరోజులపాటు నిర్వహించాలి, ఏయే అంశాలపై చర్చించాలనే అంశాలను నిర్ణయించనున్నారు.