తెలంగాణలోని రైతుల రుణమాఫీ విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి (ఆగస్టు 3) నుంచి పునః ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు
తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం.. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.కేంద్రం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనాతో సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదలచేయకుండా కేంద్రం, తెలంగాణపై అనుసరించిన కక్షపూరిత చర్యలు.. తదితర కారణాలతో ఆర్థికలోటుతో ఇన్నాల్లు కొంత ఆలస్యమైందని సీఎం కేసీఆర్ తెలిపారు.
తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్ననేపథ్యంలో, రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పునః ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్‌లో బుధవారం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఎ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు.