బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని, దీని ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆగస్టు 3 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని కామారెడ్డిలో అత్యధికంగా 74.8 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీఎస్ డీపీఎస్ పేర్కొంది.
హైదరాబాద్‌లో అత్యధికంగా తిరుమలగిరిలో 57.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయినట్లు తెలిపింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని భారత వాతావరణశాఖ చెప్పింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం బంగ్లాదేశ్ తీరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంగా ఉత్తరవాయవ్య దిశగా కదులుతోందని వివరించింది. ఈ నెల 3 నుంచి 6 వరకు వాయవ్య భారతంలో వానలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
మహారాష్ట్ర, కొంకన్ తీరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహర్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మంగళవారం నుంచి 5 రోజులు భారీ నుంచి అతి భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షపాతం ఈ ప్రాంతాల్లో సాధారణంగానే ఉంటుందని, ఆ తర్వాత 94 నుంచి 106 శాతం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.