Amaravathi:పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ సర్కారు పాపాలను దాచిపెట్టడం, వాస్తవాలను వక్రీకరించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లడంలో రామోజీరావుది అందె వేసిన చేయి అని మరోసారి నిరూపించుకున్నారు. ప్రాజెక్టు తొలి దశ పూర్తికి రూ.12,911.15 కోట్ల అదనపు నిధులు ఇచ్చేందుకు, బిల్లుల చెల్లింపులో విభాగాలవారీగా విధించిన పరిమితులు తొలగించేందుకు జూన్ 5న కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందని, తాగునీటి విభాగానికి అయ్యే వ్యయాన్ని కూడా ఇస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు సోమవారం రాజ్యసభలో చెప్పడంతో రామోజీరావు జీర్ణించుకోలేపోయారు.
చంద్రబాబు నిర్వాకం వల్ల ఏర్పడిన అడ్డంకులన్నీ సీఎం వైఎస్ జగన్ కృషి వల్ల తొలగుతుండటం, ప్రాజెక్టు శరవేగంగా పూర్తవుతుండటాన్ని ఓర్చుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు చేసిన పాపాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైకి నెట్టేలా వాస్తవాలను వక్రీకరిస్తూ మంగళవారం ఓ కథనాన్ని అచ్చేశారు. ఆ కథనంలో వీసమెత్తు నిజం లేదు. అసలు నిజాలివీ..
ఆరోపణ: పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం మరోసారి బయటపడింది. సవరించిన అంచనాల విషయంలో అవసరమైన సమాచారాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కోరినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కరవైంది.
వాస్తవం: 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలని 2020 డిసెంబర్‌లోనే పీపీఏకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. పీపీఏ సూచన మేరకు రెండు దశల్లో ప్రాజెక్టును పూర్తి చేయడానికి అంటే… 41.15 మీటర్ల కాంటూర్ వరకు అవసరమైన నిధులు, 45.72 మీటర్ల వరకు నిర్మాణానికి అవసరమైన నిధులకు సంబంధించి సామాజిక ఆర్థిక సర్వే చేయాలి. ఇందులో 41.15 మీటర్ల కాంటూర్ వరకు పూర్తి చేయడానికి రూ.10,911.15 కోట్లు కావాలని 2022 జనవరి 10న పీపీఏకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.
ఆ తర్వాత నిర్వహించిన లైడార్ సర్వేలో 45.72 మీటర్ల పరిధిలోని 5,127 నిర్వాసిత కుటుంబాలకు తొలి దశలోనే పునరావాసం కల్పించాలని తేలింది. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణం, ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని యధాస్థితికి తేవడానికి రూ.2 వేల కోట్లు కలిపి రూ.17,144 కోట్లు అవసరమని మే 4 న పీపీఏకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.