హైదరాబాద్‌లో మెట్రో రైలును మరింత విస్తరించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించిందని, హైదరాబాద్‌లో ప్రజా రవాణాను విస్తృతం చేయడం ద్వారా.. హైదరాబాద్ నుండి షాద్నగర్ వరకు మెట్రో రైలు సేవలను విస్తరించడం కీలక పరిణామం అని షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో భారత రాష్ట్ర సమితి శ్రేణులు జడ్పిటిసి పి వెంకటం రెడ్డి, పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజన్ గ్రంథాల అభివృద్ధి కమిటీ చైర్మన్ లక్ష్మీ నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోర్ర బాలు నాయక్, మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ ఈగ వెంకట్రాంరెడ్డి, ప్రతాప్ రెడ్డి, సీనియర్ నాయకులు మన్నె నారాయణ యాదవ్, చిలకమర్రి రవీందర్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున
హాజరై చౌరస్తాపై టపాసులు పేల్చారు, స్వీట్లు పంచారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగరం ఎంత పెరిగినా.. ఎన్ని పరిశ్రమలు వచ్చినా.. ఇంకా ఎంత మంది జనాభా వచ్చినా.. ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుందనీ ఇప్పటికే రెండో దశ విస్తరణలో భాగంగా మెట్రోను విస్తరిస్తున్న ప్రభుత్వం.. రెండు మార్గాల్లో డబుల్ డెక్కర్ మెట్రోలతో పాటు కొత్తగా మరో తొమ్మిది మార్గాల్లో కూడా మెట్రో విస్తరించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆనందం వ్యక్తం చేశారు. కేబినేట్‌లో తీసుకున్న నిర్ణయాలను వారు వివరించారు. అయితే మెట్రో విస్తరణలో భాగంగా.. జూబ్లీ బస్టాండ్ నుంచి తూముకుంట వరకు డబుల్ డెక్కర్ మెట్రో, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు మరో డబుల్ డెక్కర్ మెట్రో మార్గాన్ని నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఒక లేన్‌లో మెట్రో రైలు.. మరో లేన్‌లో వాహనాలు వెళ్లేలా ఈ డబుల్ డెక్కర్ మెట్రో మార్గాన్ని నిర్మించనున్నట్టు వివరించారు. షాద్ నగర్ నుండి షాద్ నగర్ వరకు మెట్రో రైలు విస్తరించడం ఇక్కడ ప్రజలకు వరమని అన్నారు. 60 వేల కోట్లతో సాగుతున్న ఈ పనులు కేసీఆర్ ప్రభుత్వ గొప్పతనం అని అన్నారు. రాబోయే నాలుగేళ్లలో పనులు పూర్తికావడం ఖాయమని ఈ ప్రాంతానికి గొప్ప గుర్తింపు రావడం తధ్యమని వారు అన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే భూములకు విలువ పెరిగిందని మెట్రో రాకతో మరింత విలువ పెరిగి ఈ ప్రాంతం సువర్ణ అధ్యాయంలో నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకన్నా ముందు చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సంతోషం వ్యక్తం చేశారు..