తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతను సుమారు 5గంటల పాటు జరిగిన రాష్ట్ర కేబినేట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. కేబినేట్‌లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా వరద బాధితుల తక్షణ సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
వరదలకు మృతి చెందిన 40 మందికి పరిహారం అందించాలని నిర్ణయించారు. పొలాల్లో ఇసుక మేటలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వరదలకు తెగిన రోడ్లు, కల్వర్టులు మరమ్మతులు చేయాలని కేబినేట్ భేటీలో నిర్ణయించారు. వరద సమయంలో ప్రభుత్వం చేసిన సహాయక చర్యలు గురించి వివరించారు.
సుమారు 27 వేల మంది ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించామని మంత్రి తెలిపారు. ఇద్దరు ఉద్యోగులు విద్యుత్ ధర్మాన్ని అద్భుతంగా నిర్వర్తించారని కొనియాడారు. ఆగస్టు 15న ఇద్దరు సిబ్బందికి ప్రభుత్వ సత్కారం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆశ్రమ పాఠశాలలో 40 మంది పిల్లలను కాపాడిన టీచర్‌కు సన్మానం చేస్తామని ప్రకటించారు.