కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఖండించారు. భార్య పద్మావతితో కలిసి తాను బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో కీలకమైన పదవిలో ఉన్న ఒక నాయకుడు, పార్టీలో తన స్థానాన్ని దిగజార్చేందుకు ఎలాంటి ఆధారం లేకుండా దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రజల్లో తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఇలాంటి దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
పార్టీలోని తన సహచరులు, అనుచరులను అణగదొక్కడం.. తొలగించడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారని ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కొన్ని సమస్యలు, పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమేనని ఉత్తమ్ పేర్కొన్నారు. జాతీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి చెందిన విధి విధానాలు అనుసరిస్తానని… అందుకే మీడియాతో కానీ, బయట గానీ మాట్లాడబోనని వివరించారు.
వ్యాపారాలు, ఒప్పందాలు, భూ లావాదేవీలు లేవని ఉత్తమ్ స్ఫష్టం చేశారు. 1994 నుంచి ఇప్పటి వరకు 30 సంవత్సరాలుగా పార్టీలో విధేయతతో పని చేస్తూ.. ఆరుసార్లు ఎన్నికల్లో గెలుపొందినట్లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. తన సతీమణి పద్మావతి రెడ్డి కోదాడ నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలుపొంది, 2018లో స్వల్ఫ ఓట్లతో ఓటమి పాలైనా కూడా పీసీసీ ఉపాధ్యక్షురాలిగా కాంగ్రెస్ తరఫున తన శక్తి మేరకు స్థానిక ప్రజల కోసం పని చేస్తున్నారన్నారు.