సహజంగానే మొక్కజొన్న శక్తికి చిరునామా. తక్షణ శక్తికి మంచి ఎంపిక. ఇందులో విటమిన్- ఎ, బి, ఇ, కె లాంటి విటమిన్లతోపాటు.. మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్‌లాంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. తక్కువ స్థాయిలో కొవ్వులూ ఉంటాయి. అందువల్ల ఎవరైనా తినొచ్చు. కాకపోతే, ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే ఇందులో కార్బొహైడ్రేట్లు కూడా ఎక్కువే.
అందుకే మధుమేహులు దూరంగా ఉండాలంటారు. అలా అని, అసలు తినకూడదని కాదు, తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. దానికి తగ్గట్టు మిగతా ఆహారాన్ని సమతులం చేసుకోవాలి. కాల్చిన వాటికంటే ఉడికించినవే మేలు. వారానికి ఒక కంకి వరకూ తినొచ్చు. ఇక, ఇందులో పీచులు ఎక్కువగా ఉంటాయి. జీర్ణశక్తికి మంచిది. తినగానే పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది.
సాయంత్రం స్నాక్‌గానో, సలాడ్‌లోనో తీసుకుంటే మంచిది. అందులోనూ ఉడికించినవి కాస్త తక్కువ మోతాదు తీసుకున్నా కడుపు నిండుతుంది. మొక్కజొన్న గింజలతో కార్న్‌ఫ్రైడ్ రైస్, కార్న్ సమోసా, క్రిస్పీ కార్న్ అంటూ రకరరకాల వంటలు చేస్తున్నారు. వీటిలో గింజల్ని వేయిస్తారు.
దీనివల్ల పోషకాలు పోతాయి. రుచికి తినడమే తప్ప ఆరోగ్యపరంగా ఏమంత లాభం ఉండదు. దానికి బదులు, గింజల్ని అన్నంతో పాటు ఉడికించి చేసే కార్న్ పలావ్ లాంటివే మేలు. అందులోనూ ఇది మక్క గారెల సీజన్ కాబట్టి ఒకటి రెండు సార్లు తింటే ఫర్వాలేదు. అయితే, ఇందులో నూనె అధికంగా ఉంటుంది. బీపీ, షుగర్ ఉన్నవాళ్లు మోతాదు మీద దృష్టి ఉంచితే మంచిది.