డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) పరిధిలో కొత్తగా 33 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ఐదు డీఎంహెచ్‌వోలతోపాటు డీపీహెచ్ రాష్ట్ర కార్యాలయంలో 28 పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా మంజూరు చేసిన డీఎంహెచ్‌వోలన్నీ హైదరాబాద్ జిల్లా పరిధిలోనివే.
సుమారు కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌లో ఒక్క డీఎంహెచ్‌వో పోస్టుతో పర్యవేక్షణ కష్టంగా మారిందని, జీహెచ్‌ఎంసీ తరహాలో ఆరు జోన్లకు ఒక్కో డీఎంహెచ్‌వోను నియమించాలని ఈ ఏడాది మే 19వ తేదీన జరిగిన క్యాబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని మొత్తం డీఎంహెచ్‌వోల సంఖ్య 38కి పెరగనున్నది. కొత్తగా మంజూరు చేసిన పోస్టులతో రాష్ట్రంలో వైద్య సేవలు మరింత మెరుగపడనున్నాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యంపై పర్యవేక్షణ పెరుగుతుందని, వ్యాధుల నివారణ, నియంత్రణ, చికిత్స ప్రక్రియలు మెరుగుపడి, అన్ని స్థాయిల్లో మెరుగైన వైద్యం అందుతుందని ట్వీట్ చేశారు.
అడిషనల్ డైరెక్టర్ (అడ్మిన్) -1
జాయింట్ డైరెక్టర్ (అడ్మిన్) – 1
డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్) -1
అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిన్- స్టేట్ క్యాడర్) – 3
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్టేట్ క్యాడర్) – 4
ఆఫీస్ సూపరింటెండెంట్ – 6
సీనియర్ అసిస్టెంట్ – 12
డీఎంహెచ్‌వో – 5
——————-
కారుణ్య నియామకాల కోసం 1266 పోస్టుల అప్‌గ్రేడ్
ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ
కారుణ్య నియామకాల కోసం వివిధ శాఖల్లో 1266 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విధుల్లో ఉండగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 1266 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వీరికి పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రస్తుతం ఉన్న ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను సూపర్ న్యూమరరీ కింద జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ మేరకు గురువారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల వారీగా జాబితాను విడుదల చేసింది. ఈ పోస్టులను భర్తీ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది.