మణిపూర్ అంశంపై ఈరోజు ఉభయ సభలు లోక్ సభ, రాజ్యసభ ల్లో బీఆర్ఎస్ ఎంపీలు పార్టీ పార్లమెంటరీ నేత కే. కేశవరావు, లోక్ సభ లీడర్ నామ నాగేశ్వరరావు నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సభ ప్రారంభమైన దగ్గర నుంచి ఎంపీలు ప్లకార్డులు చేతబట్టుకుని పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో ఉభయ సభలు స్తంభించాయి.
ఈరోజు శుక్రవారం కూడా ఎంపీ నామ నాగేశ్వరరావు ఈ అంశంపై చర్చకు మళ్లీ వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చారు. అయినా స్పీకర్ మణిపూర్ అంశంపై చర్చకు అనుమతించకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. దీంతో గత్యంతరం లేక ప్యానల్ స్పీకర్ లోక్ సభను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
మణిపూర్ అంశంపై చర్చకు పట్టుబడుతూ బీఆర్ఎస్ రెండు రోజులుగా సభలో వాయిదా తీర్మానం ఇస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కావాలని తప్పించుకుంటుందని పార్టీ లోక్ సభ లీడర్ నామ నాగేశ్వరరావు మండిపడ్డారు. ప్రజలకు ఎక్కడ వాస్తవాలు చెప్పాల్సివస్తుందోననే భయంతో కేంద్రం ఈ విషయంలో చర్చ జరపకుండా వెనక్కిపోతుందని నామ చెప్పారు.