ప్రపంచంలో ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్థికంగా బలపడాలంటే మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్) ఎంతో ముఖ్యం. సంపదను సృష్టించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇదే ప్రధాన మార్గం. ఇంత ప్రాముఖ్యమున్న మూలధన వ్యయంలో, సంపద సృష్టిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో మూలధన వ్యయం కింద రూ.37,524 కోట్లు ఖర్చు చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం.. తొలి రెండు నెలల్లోనే రూ.6,785 కోట్లు (ఏప్రిల్‌లో రూ.2,375 కోట్లు, మే నెలలో రూ.4,410 కోట్లు) ఖర్చు చేసింది. ఇది బడ్జెట్ అంచనాలో 18 శాతానికి సమానం. దేశంలో మరే రాష్ట్రం ఇంత భారీగా మూలధనాన్ని ఖర్చు చేయలేదు. దీంతో తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాలకు అందనంత ఎత్తులో నిలిచినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఏడేండ్లలోనే రూ.17,521 కోట్లు అధికం
——————————————-
స్వరాష్ట్రంగా ఏర్పడిన తొలి రోజు నుంచే తెలంగాణలో సంపదను సృష్టించడంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. అందులో భాగంగా రాష్ట్ర రాబడిలో అధిక మొత్తాన్ని మూలధన వ్యయానికి కేటాయిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భవించాక తొలి ఆర్థిక సంవత్సరం (2014-15)లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొత్తం మూలధన వ్యయం రూ.11,583 కోట్లు. 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది ఏకంగా రూ.17,512 కోట్లు పెరిగి రూ.29,104 కోట్లకు చేరింది.
యూపీ కంటే 9 రెట్లు ఎక్కువ
——————————————
కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు నిధుల కేటాయింపులో బీజేపీ పాలిత రాష్ర్టాలకు పెద్దపీట వేస్తూ తెలంగాణకు మొండిచెయ్యి చూపుతున్నది. అయినా ఆర్థిక వృద్ధిలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలేవీ తెలంగాణ దరిదాపుల్లో కూడా లేవు. దేశానికే రోల్‌మోడల్ అని బీజేపీ భజన బృందమంతా పదే పదే చెప్పే గుజరాత్ ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు నెలల్లో చేసిన మూలధన వ్యయం రూ.5,551 కోట్లు మాత్రమే. ఇది రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో 7.92 శాతానికి సమానం. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నది. ఏప్రిల్, మే నెలల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం మూలధన వ్యయం కింద రూ.2,805 కోట్లు (బడ్జెట్ కేటాయింపుల్లో 1.90%) మాత్రమే ఖర్చు చేసింది. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోనూ మూలధన వ్యయం చాలా తక్కువగా ఉన్నది. రాజస్థాన్‌లో మినహా మిగిలిన అన్ని కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఈ వ్యయ శాతం సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. దీంతో ఆయా రాష్ర్టాలు ఆర్థిక వృద్ధిని ఎలా సాధిస్తాయని ఆర్థిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర రెవెన్యూ మిగులు రూ.1,042 కోట్లు
———————————————-
రెవెన్యూ మిగులులోనూ తెలంగాణ అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. తెలంగాణ ఏర్పడే నాటికి (2014-15 ఆర్థిక సంవత్సరంలో) రూ.3,963.32 రెవెన్యూ లోటులో ఉన్న తెలంగాణ.. గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ.6,508.22 కోట్ల మిగులును సాధించింది. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు నెలల్లోనే రూ.1,042.43 కోట్ల రెవెన్యూ మిగులను నమోదు చేసింది. ఇది మన రాష్ట్ర బడ్జెట్ అంచనాలో 21 శాతానికి సమానం. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో రూ.250.40 కోట్లు, కర్ణాటకలో రూ.1218.27 కోట్ల రెవెన్యూ లోటు నమోదైనట్టు కాగ్ వెల్లడించింది.