ఒకప్పుడు కరెంటు కష్టాలకు కారణమే కాంగ్రెస్! అసమర్థ, దుష్ట పాలన వల్ల రైతులు అరిగోస పడ్డారు. అందుకే ఆ పార్టీకి ప్రజలు చరమగీతం పాడారు. అయినా బుద్ధిరాలేదు. రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు. వ్యవసాయానికి కేవలం 3 గంటల కరెంటు చాలట. ఒక గంట కరెంటుతో ఒక ఎకరం పారించవచ్చట. వ్యవసాయం గురించి తెలిసినోడు మాట్లాడే మాటలేనా? కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలతో రైతులు నవ్వుకుంటున్నారు. నవ్వులపాలైన ఆ పార్టీని పాతాళంలో పాతి పెట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరి ని నిరసిస్తూ, జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, పాలకుర్తి మండలం, ముత్తారం, పాలకుర్తి రైతు వేదికల వద్ద రైతులతో కలిసి నిర్వహించిన సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కాంగ్రెస్ వ్యాఖ్యలపై కన్నెర్ర చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మూర్ఖంగా మాట్లాడుతున్నది. తప్పుడు ప్రచారాలు చేస్తున్నది. ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నది. దున్నపోతు ఈనింది అంటే.. దొడ్లో కట్టేయమన్నట్లే ఉంది. వ్యవసాయాన్ని దండుగ చేసిన పాపం కాంగ్రెస్ దే! అత్యధికంగా ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన పాపమే కదా. ఈ రోజు ఈ లోపాలకు కారణం. రైతులు కాంగ్రెస్ పాలనలో అరిగోస పడ్డారు. సాగునీరు అందక, ప్రాజెక్టులు లేక, భూ గర్భ జలాలు అడుగంటి, తాగునీటికి కూడా తల్లడిల్లారు. కరెంటు కష్టాలు, కోతలతో, పవర్ హాలీడేలతో తల్లడిల్లినం. అని మంత్రి ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటార్లు, స్టాటర్లు, ఎండిపోయిన పైర్లు అసెంబ్లీలో ప్రదర్శించి, అల్లరి చేసే పరిస్థితి నాడు ఉండేది. వాటితోనే అసెంబ్లీ దద్దరిల్లేది. వ్యవసాయం దండుగ అనేది. ఎరువులు, విత్తనాల కొరత, నకిలీలు, సాగునీరు లేక, కరెంట్ రాక అంతా ఆగమాగం ఉండేది. రైతులు అత్మహత్యలు చేసుకునే దుర్మార్గ పాలన అనాడు సాగింది. ఎండాకాలంలో గ్రామాలకు రావాలంటేనే ప్రజాప్రతినిధులు భయపడేవారు అని ఆనాటి పరిస్థితులను మంత్రి రైతులకు వివరించారు.
అందుకే 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడారు.ఆ పార్టీని ప్రజలు పాతాళానికి తొక్కినా బుద్ధిరాలేదు. అవగాహన లేని నాయకత్వం, ప్రజలను అయోమయానికి గురి చేసే విధంగా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే, ఆ పార్టీ పని అయిపోయిందని తేలిపోతున్నదని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.