ఓట్ల సమయంలో ప్రజల సమగ్రాభివృద్ధికి పాటుపడతామని ప్రమాణాలు చేస్తున్న ఎమ్మెల్యేలు ఆ వాగ్ధానాలను మరిచి వారే సుసంపన్నులు అవుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4,001 ఎమ్మెల్యేల్లో రెండు శాతం అంటే 88 మంది శతకోటేశ్వరులని (100 కోట్లు) తాజాగా ఓ నివేదికలో వెల్లడైంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్‌ఈడబ్ల్యూ) తాజా నివేదికలో వెల్లడించాయి.
వారిలో ముగ్గురికి రూ.1000 కోట్లకు పైగా ఆస్తులుండగా, ఐదుగురికి రూ.500-1000 కోట్ల ఆస్తులు, 79 మందికి రూ.100-500 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఆ సంస్థలు తెలిపాయి. మొత్తం ఎమ్మెల్యేల్లో సుమారు 57 శాతం మందికి రూ.1 కోటి నుంచి రూ.10 కోట్లు, 21 శాతం మందికి రూ.10-100 కోట్ల ఆస్తులు ఉన్నాయని వెల్లడైంది. మొత్తం ఎమ్మెల్యేల్లో 1777 (44 శాతం) మంది క్రిమినల్, 1136 (28 శాతం) మంది ఎమ్మెల్యేలు హత్య, అపహరణ, హత్యాయత్నం, మహిళలపై దాడులు, నేర అభియోగాలను ఎదుర్కొంటున్నట్టు ఏడీఆర్, ఎన్‌ఈడబ్ల్యూ తమ నివేదికల్లో తెలిపాయి.