ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీకి భారీ షాక్‌కు తగిలింది. విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు, పంచకర్ల రమేశ్ బాబు పార్టీ నుంచి వైదొలిగారు. జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. గురువారం వైజాగ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన రాజీనామా విషయాన్ని రమేశ్ బాబు ప్రకటించారు.
పెందుర్తి నియోజకవర్గంలో కొంతకాలంలో వైసీపీ నేతల మధ్య వర్గ పోరు నడుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం టికెట్ కోసం ఎమ్మెల్యే అదీప్ రాజ్, పంచకర్ల రమేశ్‌బాబు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పెందుర్తిలో జరుగుతున్న పరిణామాలతో ఆయన కొంతకాలంగా పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్నారు..
ఈ క్రమంలోనే ప్రెస్‌మీట్ పెట్టి మరీ తన రాజీనామాను ప్రకటించారు. ఏడాదిగా ఎన్నో సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించానని.. కానీ అందుకు వీలు కాలేదని పంచకర్ల రమేశ్‌బాబు తెలిపారు. కింది స్థాయిలో సమస్యలు తీర్చలేనప్పుడు పదవిలో ఉండి లాభమేంటని ప్రశ్నించారు. ఫెయిల్యూర్ లీడర్‌గా ఉండేందుకు తాను సిద్ధంగా లేనని.. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.