వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేశమంతా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణలో అటువంటి పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. కాళేశ్వరం సహా, గోదావరి, కృష్ణా నదుల మీద ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తూ, రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉండేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో తాగు, సాగునీటికి సమస్య రాకుండా చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ సచివాలయంలో ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం, ప్రాణహిత తదితర నదుల్లో నీటి లభ్యత, రిజర్వాయర్లలోని నీటి నిల్వలు, ప్రస్తుత విద్యుత్తు డిమాండ్ తదితర అంశాలపై చర్చించారు. చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. తాగు, సాగునీటికి లోటు రాకుండా చూడాలని ఆదేశించారు. నీటిపారుదల, విద్యుత్తు శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రతి చుక నీటిని ఒడిసిపట్టి ప్రజలకు అందించాలని సూచించారు. ప్రాణహిత ప్రవాహం నుంచి నీటిని ఎప్పకప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోస్తూ మిడ్‌మానేర్‌ను నింపాలని, అకడి నుంచి లోయర్‌మానేర్ డ్యాంకు సగం, పునరుజ్జీవ వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి సగం నీళ్లను తరలించాలని తెలిపారు. తద్వారా అటు కాళేశ్వరం చివరి ఆయకట్టు సూర్యాపేట దాకా, ఇటు ఎస్సారెస్పీ ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇది పరీక్ష కాలం
——————————
‘కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతగా కష్టపడ్డారో అదే స్థాయిలో ప్రాణహిత, గోదావరి ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్టు ఎత్తిపోస్తూ రాష్ట్రంలో తాగు, సాగునీటికి ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత ఇరిగేషన్, విద్యుత్తు, వ్యవసాయశాఖ అధికారుల మీద ఉన్నది. ఇన్ని రోజులు ఒక ఎత్తు. ఇప్పుడు ఒక ఎత్తు. ఇది ఇరిగేషన్ శాఖకు పరీక్ష కాలం. ఇది మునుపటి తెలంగాణ కాదు. గతంలోలాగా ఆలోచిస్తే కుదరదు. నీటిసమస్య లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నాం. తాగు, సాగు అవసరాలకు సమృద్ధిగా నీరు అందుతున్నది.
ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడే మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటది. సంక్షోభ సమయంలోనే మనం పంటలు పండించి చూపించాలి. అప్పుడే మనం సిపాయిలం అవుతాం’ అని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ, ఎవరి పని వారు సమర్థంగా నిర్వహిస్తూ, మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ఒక సంవత్సరం అనుభవం భవిష్యత్తు తెలంగాణ చరిత్రలో ఉపయోగపడుతుందని చెప్పారు.. ఎకడి ఈఎన్సీలు అకడే ఉండి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు నీరందించడమే లక్ష్యంగా ఏకాగ్రతతో పనిచేయాలని ఆదేశించారు. ఇందుకోసం అందరం కలిసి ప్రతిజ్ఞ తీసుకోవాలని అన్నారు. తాగునీటి అవసరాల కోసం రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ సమస్య రాకుండా చూసుకోవాలని మిషన్ భగీరథ ఈఎన్సీని ఆదేశించారు. ఉదయసముద్రం, కోయిల్‌సాగర్ రిజర్వాయర్లలో కొంత నీటి ఎద్దడి ఉన్నదని, వాటిలో నీటి నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.