గోండులు నాగోబా జాతరకు తరలినట్టు.. కోయలు సమ్మక్క సారక్కలను కొలిచేందుకు మేడారం బారులు తీరినట్టు.. బంజారాలు తీజ్ పండుక్కు వెళ్లినట్టు.. గిరిపుత్రులు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఇంటిల్లిపాది ఉత్సాహంగా తరలివచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దశాబ్దాలుగా పోడు చేసుకుంటున్న గిరిపుత్రులకు అటవీ యాజమాన్య హక్కు పత్రాల పంపిణీని కుమ్రంభీం-ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జి ల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారు. తొలుత బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కా ర్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ కార్యాలయ ప్రాంగణంలో గులాబీ జెండా ఎగురవేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కోనేరు కోనప్పను కుర్చీలో ఆశీసులను చేయించారు. అనంతరం కుమ్రంభీం విగ్రహాన్ని, మాజీ మం త్రి కొట్నాక భీంరావు విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. తర్వాత జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఆదివాసీ, గిరిజనుల అవసరాలను తీర్చేందుకు ఏమేమీ చే యాలో కలెక్టర్‌సహా అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అక్కడి నుంచి ప్రగతి నివేదన సభకు చేరుకున్నారు. అందరికీ అభివా దం చేసి.. గురువారం హఠాన్మరణం చెందిన గాయకుడు సాయిచంద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
గిరిపుత్రుల్లో పట్టరాని ఆనందం
———————————–
బీఆర్‌ఎస్ బహిరంగ సభలకు ఆసిఫాబాద్ సభ భిన్నంగా సాగింది. జిల్లాలో గోండులు, కోలాం, ఆంద్, పర్దాన్ ఇలా అన్ని తెగలు ఇండ్ల నుంచి జాతరకు పోయినట్టు కొత్త బట్ట లు కట్టుకొని ఇంటిల్లిపాది సభకు సంబురంగా వచ్చారు. కేసీఆర్ సభాప్రాంగణానికి 4.23 గంటలకు చేరుకున్నారు. అంతకన్నా ముందే మధుప్రియ బృందం నిర్వహించిన ధూం.. ధాం సభికులను అలరించింది. గోండి భాష లో కళాకారులు ఆలపించిన పాటలకు సభికులు గొంతు కలిపారు. కేసీఆర్ వేదిక ప్రాంగణానికి చేరుకున్నారని మైక్‌లో ప్రకటించగానే గిరిపుత్రులు ఒక్కసారిగా లేచి నిలబడి చప్పట్లతో ఆయనకు స్వాగతం పలికారు. కొందరైతే కుర్చీలు ఎక్కి కేసీఆర్‌ను చూసి సంబురపడ్డారు. సీఎం కేసీఆర్ మాట్లాడినంత సేపు, ఆయన చెప్పే విషయాలను ఓపికగా వింటూ చప్పట్లతో హర్షాతిరేకాలు తెలిపారు. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు కేసీఆర్ వరాల జల్లు కురిపించిన ప్రతిసారి యు వత, మహిళలు ఈలలు కొట్టారు. కేసీఆర్ గోండిభాషకు గిరిజనం సంబురపడ్డారు.
సర్కార్ సరికొత్త పండుగ
——————————–
సీఎం కేసీఆర్ పంపిణీ చేసిన పోడు పట్టాలను స్వీకరించిన 12 జంటలు కొత్తబట్టలతో పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ 12 జంటలకు డ్రెస్‌కోడ్ (తెల్ల దోతి, కమీజ్, రుమాల్, మహిళలకు చిలుకపచ్చ చీర, బ్లౌజ్‌ను గిరిజన సంక్షేమశాఖ అందించింది. కొత్తబట్టలతో అటవీహక్కుల పట్టాలు అందుకున్నవాళ్ల ఇండ్లకు సర్కార్ పండుగకు తెచ్చింది.